‘సి ఫర్ అనగానే క్యాట్ అనేస్తారు. ఇప్పట్నుంచి సి విటమిన్ అని చెప్పేసుకోండి. ఎందుకంటే విటమిన్లలో నా అంత పాపులారిటీ మరి దేనికీ లేదండోయ్. మిగతా విటమిన్ల గురించి తెలియకపోయినా చాలామందికి నేను తెలుసు. కనీసం నా పేరైనా వినుంటారు. ఇంతకీ నా అసలు పేరేంటో తెలుసా? ఆస్కార్బిక్ ఆమ్లం.
'సి ఫర్ క్యాట్ కాదు... సి విటమిన్' - c vitamin
అన్ని విటమిన్లూ ఒక వైపు... విటమిన్ సి మరో వైపు... ఏది లేకపోయినా అదొక్కటి ఉంటే చాలు ఆరోగ్యాన్ని కాపాడ్డానికి... ఇంకా దాని గురించి బోలెడన్ని సంగతులు ఉన్నాయ్... అవేంటో చెప్పడానికి అదే వచ్చేసింది... మరి చదివేద్దామా?
'సి ఫర్ క్యాట్ కాదు... సి విటమిన్'
ఓసారి పోషకాహార నిపుణులు కొందరిని పిలిచి ఒక ప్రశ్న అడిగారు. అదేంటంటే... మిగతా పోషకాలేవీ లేనప్పుడు ఏదో ఒక్కదాన్నే ఎంచుకోమంటే దేన్ని కోరుకుంటారని అడిగారు. వాళ్లంతా దేన్ని ఎంచుకున్నారో తెలుసా? నన్నే. మీ ఆరోగ్యాన్ని కాపాడటంలో నేను చేసే పని అలాంటిది మరి.
- మీరు నవ్వుతుంటే ఎంత అందంగా ఉంటారో. మీ లేత గులాబీ చిగుళ్లు, తళతళా మెరిసే తెల్లటి పళ్లు ఇట్టే కట్టి పడేస్తాయి. అవి అలా ఆరోగ్యంగా ఉండటానికి కారణం నేనే. తగినంతగా నేను లేకపోతే స్కర్వీ అనే జబ్బు వస్తుంది. దీనితో చిగుళ్లు మెత్తబడతాయి. వాటిల్లోంచి మాటిమాటికీ రక్తం వస్తుంటుంది. పళ్లు వదులవుతాయి. చిన్న గాయానికే కందిపోతారు.
- బడిలో అయినా ఇంట్లో అయినా మీ కాలు ఒక దగ్గర నిలవదు కదా. ఎప్పుడూ పరుగెత్తటం, గెంతటం, దూకటమేనాయె. ఇవన్నీ చేయటానికి ఎముకలు, వాటిని పట్టుకొని ఉండే కండరాలు బలంగా ఉండొద్దూ. దీనికి సాయం చేసేదీ నేనే. ఎముకల్ని పట్టుకొని ఉండే కండర పోచలు (కొలాజెన్) పుట్టడానికీ¨ ఉపయోగపడతా.
- ఇన్నేసి పాఠాలు ఎలా చదవాలో? పరీక్షలు ఎలా రాయాలో? అని మీరు అప్పుడప్పుడు బెంగ పడుతుంటారుగా. అప్పుడు మీకు ఒత్తిడి వచ్చేస్తుంది. దీంతో మెదడు, నాడీ వ్యవస్థ పనితీరు అస్తవ్యస్తం అవుతుంది. అప్పుడూ మిమ్మల్ని కాపాడేది నేనే మరి. మెదడు నుంచి సమాచారాన్ని చేరవేసే రసాయనాలను ఉసిగొల్పుతూ మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంటానన్నమాట.
- ఇంకానేమో... మీరు త్వరగా జలుబు, దగ్గు, జ్వరం వంటి జబ్బుల బారిన పడకుండానూ కాపాడు తుంటా. ఎందుకంటే జబ్బులు రాకుండా కాపాడే రోగ నిరోధకశక్తిని పెంచటంలో నేను పాలు పంచుకుంటాగా. నాకు మరో ప్రత్యేకతా ఉందండోయ్. అదేంటంటే... యాంటీ ఆక్సిడెంట్‌గానూ ఉపయోగపడటం. అంటే అర్థం కాలేదా? మరేం లేదు... శరీరంలో జరిగే రకరకాల పనుల్లో భాగంగా కొన్ని విశృంఖల కణాలు (ఫ్రీ ర్యాడికల్స్) పుడతాయి. వేటితోనూ జత పడకుండా స్వేచ్ఛగా సంచరించే ఇవి పెరిగిపోతే కణాలు, కణజాలాలకు ఇబ్బంది. కణాల్లోని జన్యు పదార్థమూ (డీఎన్‌ఏ) దెబ్బతినొచ్చు. దీంతో క్యాన్సర్ల వంటి జబ్బులూ రావొచ్చు. ఇలాంటి వాటిని అరికట్టేది యాంటీ ఆక్సిడెంట్లే.
- ఇలా నా గురించి చెబుతూపోతే చాలానే ఉన్నాయ్. మీరు తినే ఆహారంలోని ఐరన్‌ను శరీరం బాగా గ్రహించుకునేలా చేస్తుంటా. మీరు ఉత్సాహంగా ఉండేలా చూస్తుంటా.
- గమ్మత్తయిన విషయం చెప్పనా? జంతువులు సొంతంగా నన్ను తయారు చేసుకుంటాయి. కానీ మీరు చేసుకోలేరు. ఆహారం ద్వారానే తీసుకోవాలి.
- ఇంతకీ నేను ఎందులో ఎక్కువగా ఉంటానో తెలుసా? నారింజ, నిమ్మ, పంపర పనస వంటి పుల్లటి పండ్లలో. అసలు ఈ పుల్లటి పండ్ల ఆధారంగానే నా ఉనికిని శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పట్లో రోజులకొద్దీ నౌకల్లో ప్రయాణాలు చేసేవారికి స్కర్వీ జబ్బు వస్తుండేది. నారింజ పండ్లు, నిమ్మకాయలు తీసుకుంటే ఇది తగ్గిపోయేది. దీనికి కారణం నేనేనని చివరికి గుర్తించారు. హంగరీ శాస్త్రవేత్త ఆల్బర్ట్ జెంట్ గ్యోర్గీ తొలిసారిగా 1928లో జంతువుల అడ్రినల్ గ్రంథుల నుంచి నన్ను వేరుచేశాడు. కాకపోతే నన్ను హెక్జురోనిక్ యాసిడ్ అని పిలుచుకునేవాడు. తర్వాత బ్రిటన్ శాస్త్రవేత్త వాల్టర్ హవోర్త్ నా అణు స్వరూపాన్ని విడమరచి, ఆస్కార్బిక్ యాసిడ్ అని పేరు పెట్టాడు. ఇదే చివరికి విటమిన్ సిగా మారిపోయింది.
- బొప్పాయి, స్ట్రాబెర్రీ, పనస, పుచ్చకాయ, యాపిల్, అరటి పండ్లలోనూ నేను దండిగా ఉంటా. పచ్చగోబీ, క్యాబేజీ, గోబీ పువ్వు, మెంతికూర, టమోటాలు, పాలకూర, చిలగడ దుంప, బఠానీలు, క్యారెట్లు, చింతపండు, బంగాళాదుంప, దోసకాయ, ఉల్లిగడ్డ, పుదీనా, ఉసిరికాయ వంటివీ నా ఇళ్లే. ఒక్కమాటలో చెప్పాలంటే తాజా పండ్లు, ఆకు కూరలు, కూరగాయలన్నింటిలోనూ ఉంటానన్నమాట. నేను మీ ఒంట్లో నిల్వ ఉండను. ఎప్పటికప్పుడు ఆహారం ద్వారా తీసుకోవాల్సిందే. ఇంకేం అన్నీ లాగించేయండి. ఉంటా.
- కె విటమిన్ గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి: మీ ఒంట్లో.. నేనుంటేనే.. మీరు ఓకే !
- ఇ విటమిన్ గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి: ఇసుమంతే... ‘ఇ’నుమంతై!
- డి విటమిన్ గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి:డివ్వీ.. డివ్వీ.. డి విటమిన్!