Ilayaraja Orchestra in Gachibowli: అమ్మ చేతి వంటలాగే తన పాటలు తాను రుచి చూశాకే ప్రేక్షకులకు అందిస్తానని మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా అన్నారు. మ్యూజిక్ అంటే టెక్నాలజీ కాదని, టెక్నిక్ అన్న ఆయన.. ఈ నెల 25, 26న తన ఆర్కెస్ట్రా బృందంతో హైదరాబాద్ రాబోతున్నట్లు ప్రకటించారు. గచ్చిబౌలి మైదానం వేదికగా హైదరాబాద్ టాకీస్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరగనున్న సంగీత విభావరికి సంబంధించిన వివరాల్ని హైదరాబాద్ టి-హబ్ వేదికగా నిర్వాహకులు వివరాలు వెల్లడించారు.
సంగీత దర్శకుడు ఇళయరాజాతో పాటు ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, నేపథ్య గాయనీ సునీత, హైదరాబాద్ టాకీస్ సాయితో పాటు టి-హబ్ ప్రతినిధులు హాజరయ్యారు. ఇళయరాజా పాటలతో 25, 26న పూలవర్షం కురవబోతుందన్న గాయనీ సునీత.. సంగీతంలో ఇళయరాజాను దేవుడిగా అభివర్ణించారు. అలాగే టి-హబ్ ద్వారా కళారంగంలో నూతన ఆవిష్కరణలు చేసేందుకు నైస్ అనే కార్యక్రమాన్ని రూపొందించినట్లు జయేశ్ రంజన్ వివరించారు. తన పాటలతో హైదరాబాద్ అదిరిపోవాలన్న ఇళయరాజా.. రసజ్ఞులైన ప్రేక్షకులు తన సంగీత విభావరికి హాజరుకావాలని కోరారు.
"నేను పాటలు విన్న తరువాతనే మీరు వింటారు. మొదటగా పాటలు వినేది నీనే. నా కంటే పాటలు ఎవరు బాగా వినలేరు. అమ్మ చేతి వంటలాగే తన పాటలు తాను రుచి చూశాకే ప్రేక్షకులకు అందిస్తా.. మ్యూజిక్ అంటే టెక్నాలజీ అంటారు కాదు. మ్యూజిక్ టెక్నిక్. ఈ నెల 25, 26న నా ఆర్కెస్ట్రా బృందంతో హైదరాబాద్ వస్తున్నా"- ఇళయరాజా, సంగీత దర్శకుడు
"సంగీతంలో ఆయన దేవుడు. మాధుర్యానికి ప్రాతినిథ్యం వహించింది ఏదైనా ఉందంటే.. మన మనసును ప్రశాంతతవైపు నడిపించేది ఏమైనా ఉందంటే.. మనసుకు అంటిన మలినాలను తుడిచిపెట్టేది ఏమైనా ఉందంటే అది ఇళయరాజా గారి సంగీతం ఒక్కటే..అని నేను గర్వంగా గట్టిగా చెబుతా"- సునీత, గాయని