దిల్లీ కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో భాజపాయేతర రాజకీయ పార్టీలు సమావేశమయ్యాయి. తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కాంగ్రెస్ నేతలు కపిల్ సిబల్, అభిషేక్ మనుసింఘ్వీ, ఆప్ నేత సంజయ్ సింగ్, విపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంపై చర్చ జరిగింది. ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాల ఆరోపణలపై మాట్లాడారు. ఈవీఎంలలో లోపాలపై సాంకేతిక నిపుణులతో చర్చించారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసే అంశంపై సమాలోచనలు జరిపారు.
''అవి.. పనికిరాని ఈవీఎంలు''
సాంకేతికత ఎక్కడ వాడాలి.. ఎక్కడ వాడకూడదో తెలుసుకోవాలన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్నికల్లో పనికిరాని ఈవీఎంలను ఉపయోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపును అంగీకరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ అంశంపై సుప్రీంకోర్టులో పోరాడతామని స్పష్టం చేశారు.
యంత్రాలపై విశ్వాసం లేదు: కపిల్ సిబల్
యంత్రాలపై విశ్వాసం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్. పేపర్ బ్యాలెట్‌పైనే నమ్మకం ఉందని స్పష్టం చేశారు. ఓటరు ఎవరికి ఓటు వేస్తారో వారికే ఓటు చెందాలన్నారు. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపును ఈసీ ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. యంత్రాలు ఎలా దుర్వినియోగం అవుతాయో తాము చూపిస్తామని సవాల్ విసిరారు.