తెలంగాణకు చెందిన ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ వర్కింగ్ అధ్యక్షులు హన్స్‌రాజ్ ఏపీ హైకోర్టు సీజే గురించి అర్థంలేని ఆరోపణలు చేయడం దురదృష్టకరమని ఐఏఎల్ రాష్ట్ర కమిటీ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
సీజేపై ఆరోపణలు తగవు: ఐఏఎల్ రాష్ట్ర కమిటీ
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై వ్యక్తిగత, అవాస్తవిక ఆరోపణలు చేయడం తగదని భారత న్యాయవాదుల సంఘం ఐఏఎల్ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సంఘం ఆ రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు ఓ ప్రకటన జారీచేశారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై, న్యాయవ్యవస్థను అవమానపరచాలనే దురాలోచనతో కొందరు తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఐఏఎల్ తీవ్రంగా ఖండించింది.
"హన్స్‌రాజ్ తెలంగాణలో ఉండటం వల్ల ఏపీ హైకోర్టులో ఏమి జరుగుతోందో అర్థంకాక ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను సరిదిద్దే క్రమంలో ఇటీవల ఇచ్చిన తీర్పులు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటం వల్ల కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి ఆరోపణల వల్ల సానుకూల తీర్పులు వస్తాయనే దురాలోచనతో కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఆన్‌లైన్ ద్వారా మాత్రమే కేసుల్ని దాఖలు చేసేటట్లు సీజే చర్యలు తీసుకున్నారు. ఆ విషయం ఏపీలోని న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులకు తెలుసు. దివంగతులైన ఇంఛార్జి రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ మరణానికి సీజే కారణమని పేర్కొనడం హాస్యాస్పదం. రాజశేఖర్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 15న కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చింది. 24న మరణించారు. వాస్తవాల్ని మభ్యపెట్టి ప్రధాన న్యాయమూర్తిపై తప్పుడు ఆరోపణలు చేయడం వెనుక కొన్ని శక్తులు, ప్రభుత్వ లబ్ధి పొందుతున్న కొందరు విశ్రాంత న్యాయమూర్తుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయవ్యవస్థపై ఇలాంటి ఆరోపణలు చేసినవారిపై తక్షణ చర్యలు తీసుకోవాలి" -ఐఏఎల్ రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు
ఇదీ చదవండి:'ఎస్సై నన్ను మోసం చేశాడు'... 'కాదు ఎస్సై మోసపోయాడు'