Job Fraud Gang Arrest in Hyderabad: ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సిద్దిపేటకు చెందిన గడ్డగోని చక్రధర్ గౌడ్ బీకాం పూర్తి చేశాడని.. 2008 నుంచి ఏడాది పాటు ఎల్ఐసీ ఏజెంట్‌గా పని చేశాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత హయత్‌నగర్ శాఖ కోటక్ మహేంద్రలో 2011 వరకు పని చేసినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిందన్నారు. అక్కడ పని చేసిన సాకేత్‌తో ఏడాది పాటు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసినట్లు గుర్తించారు.
నెలకు జీతం ఇస్తూనే మూడు పూటలా భోజనం, వసతి: అయితే తనకు వస్తున్న జీతం జల్సాలకు సరిపోక.. సైబర్ మోసాలకు పాల్పడుతున్న వారితో పని చేశారు. ఆ అనుభవంతోనే తన స్నేహితుడు శ్రావణ్, గణేశ్‌తో కలిసి పంజాగుట్టలో ఓ ఇంటిని నెలకు రూ.లక్ష 30 వేలు చెల్లిస్తూ అద్దెకు తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి సుమారు 32 మంది టెలీ కాలర్లను నియమించుకున్నాడు. ఒక్కొక్కరికి రూ.15-19 వేలు జీతం ఇస్తూ, మూడు పూటలా భోజనం, వసతిని కూడా కల్పించాడు.
డెటా ఎంట్రీ జాబ్ ఇప్పిస్తామంటూ..: వారు నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేల జీతం వచ్చే డేటా ఎంట్రీ ఉద్యోగాన్ని ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి.. మీకు వచ్చే నెల జీతంలో వారికి కమీషన్ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతారు. ఎవరైతే ఈ మోసగాళ్ల షరతులను అంగీకరిస్తారో.. వారి నుంచి జేపీజీ ఫైల్స్ పంపించి వాటిని పీడీఎఫ్ కన్వర్ట్ చేయాలని షరతులు పెడతారని పోలీసులు వివరించారు. ఇచ్చిన పనిని పూర్తి చేసిన వారికి ముందుగా.. మీరు మాకు రావ్వాల్సిన కమీషన్ రూ.2500 తమ ఖాతాల్లో డిపాజిట్ చెయ్యాలని డిమాండ్ చేస్తారు. మిగితా జీతం మీ ఖాతాలో జమ చేస్తామంటూ చెప్తారు.