ప్రస్తుతం టెలీస్కోపిక్ విధానంలో హైదరాబాద్ జలమండలి నీటి బిల్లులు వసూలు చేస్తోంది. స్లాబ్‌ల వారీగా నల్లా ఛార్జీలు చెల్లించాలి. ఉదాహరణకు నెలకు 15 కిలో లీటర్ల(కి.లీ.) నీటిని వాడే ఓ నల్లాదారుడు 0-15 శ్లాబు కింద ప్రతి కి.లీ.కు నెలకు రూ.10 నీటి ఛార్జీతోపాటు మొత్తం బిల్లుపై 33 శాతం మురుగు ఛార్జీ చెల్లించాలి. నిర్ణీత సమయం కంటే 3-5 రోజులు ఆలస్యంగా రీడింగ్ నమోదు చేయడం వల్ల శ్లాబు మారుతుంది.
అప్పుడు 16-30 శ్లాబులోకి చేరితే ఆటోమేటిగ్గా ప్రతి కి.లీ.కు ఛార్జీ పెరుగుతుంది. మొత్తం బిల్లులపై మురుగు ఛార్జీలూ పెరిగి అదనపు భారం పడుతుంది. వాస్తవానికి జలమండలి నిబంధనల ప్రకారం 30-31 రోజులకు మాత్రమే రీడింగ్ నమోదు చేయాలి. కొన్ని ప్రాంతాల్లో 36-38 రోజులకు నమోదు చేస్తుండడం నీటి బిల్లుల పెరుగుదలకు కారణమవుతోంది. రీడింగ్ నమోదు, బిల్లుల పంపిణీకి జలమండలి పొరుగు సేవల సిబ్బందిపై ఆధారపడుతోంది. వీరికి ఏటా రూ.కోట్లలోనే చెల్లిస్తున్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహణలో ఈ సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.