చరవాణిలో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసుకుంటూ రోడ్లపై వెళ్తున్నారా?.. అయితే మీ లెసెన్స్ రద్దుతోపాటు జైలుకు వెళ్లడమూ ఖాయమే. ఎందుకంటే.. సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. ఇది ప్రమాదాలకు దారితీస్తోందంటూ కోర్టులకు నివేదించారు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తులు జరిమానాతో పాటు జైలుశిక్షలు విధిస్తున్నారు.
ట్రాఫిక్ పోలీసులు గతనెల తొలి పక్షంలో 63 కూడళ్లు, రహదారుల్లో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వెళ్తున్న వారిని గుర్తించారు. చరవాణితో మాట్లాడుతూ వాహనం నడిపేటప్పుడు చోదకుల ప్రవర్తనల్లో మార్పులను బృందం సభ్యులు పరిశీలించారు.
ఫోన్ మోగగానే... ద్విచక్రవాహనచోదకులు వెంటనే దాన్ని చేతికి తీసుకుని మరో చేత్తో వాహన వేగాన్ని నియంత్రిస్తున్నారు. మరికొందరు అవతలి వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు వినిపించకపోవడం వల్ల ఫోన్ దగ్గరగా పట్టుకునే ప్రయత్నంలో యాక్సిలేటర్ ఎక్కువగా ఇస్తున్నారు. దీంతో ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొడుతున్నారు. ద్విచక్రవాహన చోదకుల్లో 80 శాతం మంది ఫోన్‌లో మాట్లాడుతుండగా కార్లలో వెళ్లే డ్రైవర్లు 40 శాతం మంది కారు నడుపుతూనే మాట్లాడుతున్నారని పోలీసులు గుర్తించారు.
చరవాణి చూస్తూ వాహనదారులు చేస్తున్న ప్రమాదాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. దీనిపై స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు... అప్రమత్తమై మూడు కమిషనరేట్ల పరిధుల్లో ఈ ప్రమాదాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. వాహనచోదకులు చరవాణిలో మాట్లాడుకుంటూ వెళ్తున్నా, శిరస్త్రాణంలో ఫోన్‌ను ఉంచుకుని వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని పట్టుకుంటున్నారు. పోలీసులులేని చోట్ల కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానమైన సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.
ఇవీ చూడండి:హారన్ వేశారో... ఆగి తీరాల్సిందే