హైదరాబాద్ చాదర్‌ఘాట్ హత్య (Chaderghat Murder) కేసును పోలీసులు ఛేదించారు. రౌడీషీటర్ హత్య కేసులో ఐదుగురిని అరెస్టు చేశారు. అన్నదమ్ములు మహమూద్, అయూబ్‌ను వీరికి సహకరించిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను సీపీ అంజనీకుమార్ (Cp Anjani kumar) మీడియా ముందు హాజరుపరిచారు.
ఆధిపత్యం కోసమే ముస్తాక్‌ను హత్య చేశారని సీపీ తెలిపారు. గత 6 నెలల్లో 21 మంది రౌడీషీటర్లపై పీడీయాక్ట్ నమోదు చేసినట్లు వివరించారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. మరో 30 మందిపై పీడీ యాక్ట్ నమోదుకు పరిశీలిస్తున్నట్లు వివరించారు.
ఈనెల 17న హత్య...
వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న రౌడీషీటర్ ముస్తాక్ ఈ నెల 17న దారుణ హత్యకు గురయ్యాడు. ఇతర రౌడీషీటర్ల చేతుల్లోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన చాదర్‌ఘాట్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. టౌలీచౌకి హుమాయున్‌నగర్‌కు చెందిన సయ్యద్ ముస్తాక్ ఉద్దీన్ రౌడీషీటర్. అతడికి ఓల్డ్‌మలక్‌పేటలో సొంత ఇల్లు ఉండడంతో తరచూ వస్తుంటాడు.
శుక్రవారం అర్ధరాత్రి ఓల్డ్‌మలక్‌పేటలోని అబూబాకర్ మసీదు వద్దకు వచ్చాడు. సోదరులైన అయూబిన్ అలీ, మహమూద్ మరో నలుగురు యువకులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఘర్షణ తలెత్తింది. అది కాస్త ముదరడంతో ఆగ్రహానికి గురైన వారంతా సయ్యద్ ముస్తాక్ ఉద్దీన్‌ను కత్తులతో పొడిచారు. రాళ్లతోనూ దాడికి పాల్పడ్డారు. ముస్తాక్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని అతడి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.