Govt School Students Request Himanshu to Adopt Their School : హైదరాబాద్ నారాయణగూడలోని ప్రభుత్వ పాఠశాలలో సరైన వసతులు లేవని.. ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు తమ పాఠశాలను దత్తత తీసుకోవాలని ఆ పాఠశాల విద్యార్థులు కోరారు. కేశవనగర్ సర్కారు బడిని తీర్చిదిద్దినట్లుగా తమ స్కూల్‌నూ ఆధునికీకరించాలని కోరారు. ఈ మేరకు ఏఐవైఎఫ్, బాల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ప్లకార్డులు చేతబట్టి విజ్ఞప్తి చేశారు. 'ఓ హిమాన్షు అన్న.. మా స్కూల్‌ను దత్తత తీసుకోండి.. మీరు దత్తత తీసుకుంటే మాకు కొత్త రూమ్స్, కొత్త టాయిలెట్స్, కొత్త యూనిఫామ్స్ అన్నీ ఇట్టే వస్తాయన్న. రాష్ట్ర ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదన్నా.. ప్లీజ్.. ప్లీజ్.. ప్లీజ్ అన్నా అంటూ ప్లకార్డులపై రాసి నినాదాలు చేశారు. తమ స్కూల్ బిల్డింగ్ సరిగా లేదని.. వర్షాకాలం వస్తే బడిలో కూర్చోవడానికీ ఇబ్బందిగా ఉందని విద్యార్థులు తెలిపారు. హిమాన్షు అన్న.. పెద్ద మనసుతో స్పందించి కొత్త బిల్డింగ్ కట్టించాలని కోరారు.
విద్యార్థులకు తాగడానికి నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని.. మంత్రి కేటీఆర్ తనయుడు వెంటనే స్పందించి సహాయం చేయాలని ఏఐవైఎఫ్ సంఘం నాయకులు కోరారు. మూత్రశాలల డోర్లు విరిగిపోయాయని.. పాఠశాలకు ప్లే గ్రౌండ్ లేదని, కంప్యూటర్లు లేవనిఆరోపించారు. భోజనం సరిగా లేదని, మంచి భోజనం పెట్టించాలని అన్నారు. స్కూల్ యూనిఫామ్స్, చదువుకోవడానికి పుస్తకాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉన్న 24 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే పరిస్థితి ఉందని ఏఐవైఎఫ్, బాల సంఘం నాయకులు ఆరోపించారు. మన బస్తీ, మన బడి నిధులు పక్కదారి పట్టిస్తూ ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ మనవడు, కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు.. ఇటీవల తన సొంత నిధులతో హైదరాబాద్ కేశవనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలను ఆధునికీకరించిన సంగతి తెలిసిందే. కేశవనగర్ పాఠశాలకు వెళ్లిన హిమాన్షు.. ఆ పాఠశాల పరిస్థితిని చూసి చలించిపోయానని గుర్తు చేసుకున్నారు. స్కూల్లో సరైన బాత్రూమ్లు లేవని, ఆహార సదుపాయాలు సరిగా ఉండేవి కావని.. ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాల అభివృద్ధి కోసం తన తోటి విద్యార్థులతో కలిసి రూ.90 లక్షల నిధులు సేకరించి పాఠశాలలో డిజిటల్ తరగతి గదులు, మెరుగైన పరిసరాలు, భోజనం చేసే గది, బాత్రూమ్లను ఏర్పాటు చేశామని తెలిపాడు. కేసీఆర్ మనవడిగా ఏదైనా గొప్పగా, మంచిగా చేయాలన్నదే తన ఉద్దేశమని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా పలు పాఠశాలల విద్యార్థులు హిమాన్షు.. తమ పాఠశాలను సైతం దత్తత తీసుకోవాలని కోరుతున్నారు.