Hyderabad Floods 2023 :హైదరాబాద్‌లో గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. వరద నీటితో అతలాకుతలమయిన ప్రాంతాల్లో పునరుద్ధరణ చర్యలు మొదలయ్యాయి. భాగ్యనగరంలో కురిసిన అతి భారీ వర్షాల వల్ల పలు చోట్ల రోడ్లు, జనావాసాలు జలమయమయ్యాయి. మరికొన్ని చోట్ల చెరువులు, వాగులు, కాలువలు, నాలాలు ఉద్ధృతంగా ప్రవహించాయి. వాటి కారణంగా స్థానికులు ఇబ్బందులు పడ్డారు.
Hyderabad Rains Today 2023 : నగరంలోని చాదర్‌ఘాట్ వంతెన(Chaderghat Bridge) మీదుగా రాకపోకలను ఇప్పటికే పునరుద్ధరించారు. వంతెన మీదుగా రాకపోకలు సాగించాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనాల రద్దీ దృష్ట్యా సుమారు ఉదయం 7 గంటల సమయంలో పోలీసులు బారికేడ్లను తొలగించారు. వంతెన కింద నుంచి వరద ప్రవాహం ఉండంతో ప్రస్తుతం ముప్పు లేదని చెప్పారు. మరోవైపు నగరంలో వరద నీటి వల్ల బురదమయమైన రహదారులు.. నిలిచిపోయిన నిల్వ నీరు.. తెగిపోయిన కాల్వగట్టులు.. ఇతర పనులను పారిశుద్ధ్య కార్మికులు గుర్తించి.. పునరుద్ధరిస్తున్నారు.
Hyderabad Rains in September 2023: భారీ వర్షానికి నీట మునిగిన హైదరాబాద్ నగరంలో పలు కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖైరతాబాద్ పెద్ద గణేశ్(Khairtabad Ganesh) ఎదురుగా ఉన్న ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్‌లో.. వర్షానికి కాలనీల్లో భారీగా నీరుచేరింది. గత మూడు రోజులుగా కాలనీల్లో మోకాళ్ల లోతు నీరు నిలవడంతో.. స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత అధికారులకు అనేక సార్లు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని.. స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. నీరు నిల్వకుండా త్వరలో పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నా.. ఆచరణలో కనిపించలేదని వాపోయారు. తాము అనుభవిస్తున్న బాధకు పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.