తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్-బీపాస్ బిల్లు భవన నిర్మాణాలకు మరింత ఊతం ఇచ్చేదిగా ఉందని హైదరాబాద్ క్రెడాయ్ అభిప్రాయపడింది. టీఎస్-ఐపాస్ మాదిరి టీఎస్-బీపాస్ బిల్లు తీసుకురావడం శుభపరిణామమని హైదరాబాద్ క్రెడాయ్ అధ్యక్షుడు రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిలు ప్రభుత్వాన్ని కొనియాడారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. టీఎస్-బీపాస్ తీసుకురావడం వల్ల నిర్దేశించిన సమయంలో భవన నిర్మాణ అనుమతులు మంజూరవుతాయని... గతంలో మాదిరి వివిధ శాఖల చుట్టూ బిల్డర్లు తిరగాల్సిన పని లేకుండా పోతుందన్నారు. భవన నిర్మాణాల అనుమతులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు ఓ ప్రైవేటు సంస్థను ఏర్పాటు చేసి... అది వివిధ రాష్ట్రాల్లో, దేశాల్లో అధ్యయనం చేసి ఇచ్చిన నివేదికను ప్రభుత్వానికి అందచేసినట్లు వివరించారు. దాని ఆధారంగానే ఇవాళ టీఎస్-బీసాప్ బిల్లు వచ్చిందని... అది నిర్మాణ రంగానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
'టీఎస్-బీపాస్ బిల్లు తీసుకురావడం శుభపరిణామం' - హైదరాబాద్ క్రెడాయ్
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్-బీపాస్ బిల్లు భవన నిర్మాణాలకు ఊతమిచ్చేదిగా ఉందని హైదరాబాద్ క్రెడాయ్ అధ్యక్షుడు రామకృష్ణారావు అభిప్రాయపడ్డారు. టీఎస్-బీపాస్ తీసుకురావడం వల్ల నిర్దేశించిన సమయంలో భవన నిర్మాణ అనుమతులు మంజూరవుతాయని.. గతంలో మాదిరి వివిధ శాఖల చుట్టూ బిల్డర్లు తిరగాల్సిన పని లేకుండా పోతుందన్నారు.
కరోనా ప్రభావం భవన నిర్మాణాలపై పడినా.. ధరలు తగ్గే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఒకరిద్దరు ఆర్థిక ఇబ్బందుల వల్లనో లేక ఇతర ప్రాజెక్టులకు డబ్బు సర్దుబాటు కాకనో ధర తగ్గించి అమ్మకాలు చేస్తున్నారన్నారు. కరోనా ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని భావిస్తున్న ప్రజలు కూడా తమ అవసరాల కోసం బయటకు వస్తున్నారని, సొంత ఇళ్లు ఉండాలన్న ఆలోచనతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సందర్శనకు వస్తున్నట్లు తెలిపారు. కొవిడ్‌కు ముందున్న ధరలే ఇప్పుడు అమలవుతున్నాయని... ఇప్పుడున్న పరిస్థితుల్లో సిమెంటు, స్టీలు ధరలు పెరగడం, కార్మికుల కూలీ పెరగడం లాంటి కారణాలతో భవిష్యత్తులో ధరలు పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే దాదాపు 80శాతం ప్రాజెక్టుల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, అక్టోబరు నాటికి పూర్తి స్థాయిలో నిర్మాణ రంగం ఊపందుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: ఇళ్లు కట్టుకునే పేదలకు టీఎస్‌బీపాస్ బ్రహ్మాస్త్రం: కేటీఆర్