Hyderabad Commissionerate Annual Crime Report 2023 :రాష్ట్రంలో 2022తో పోలిస్తే ఈ ఏడాది 2 శాతం నేరాలు పెరిగాయని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో వార్షిక నేర నివేదికను విడుదల చేసిన సీపీ శ్రీనివాస రెడ్డి, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ల కన్నా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు పెరిగాయని వెల్లడించారు. సైబర్ సెక్యూరిటీపై నిపుణులను పిలిచి అవగాహన కల్పించామని పేర్కొన్నారు. 2022తో పోలిస్తే 2023లో 2 శాతం నేరాలు పెరిగాయన్నారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
Annual Crime Report in Telangana 2023 :ఈ ఏడాది అన్ని పండుగలు, ర్యాలీలు ప్రశాంతంగా నిర్వహించామని, అసెంబ్లీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించామని తెలిపారు. ట్రాఫిక్‌లో కూడా త్వరలో మరికొన్ని పీఎస్‌లు వస్తాయని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేసుకున్నామని, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో సదస్సులు నిర్వహించామని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులనూ వేగంగా పరిష్కరిస్తున్నామని సీపీ వివరించారు.
'మహిళలపై రేప్ కేసులు 2022లో 343 ఉంటే, ఈ ఏడాది 403 నమోదయ్యాయి. గతేడాది సైబర్ నేరాల్లో రూ.82 కోట్లు మోసపోతే, ఈ ఏడాది రూ.133 కోట్లు కాజేశారు. 2022లో 292 కేసులు నమోదు కాగా, 2023లో 344 కేసులు వచ్చాయి. డ్రగ్స్ నిర్మూలనకు నార్కోటిక్ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తుంది. సరఫరా చేసే వాళ్లు ఎక్కడ ఉన్నా పట్టుకుంటాం. డ్రగ్స్‌ను గుర్తించేందుకు స్నిఫర్ డాగ్స్‌ను వినియోగిస్తాం' అని సీపీ శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు ఈ ఏడాది 70 శాతం తగ్గాయని హైదరాబాద్ సీపీ పేర్కొన్నారు.
ఒక్కరికి శిక్ష పడితే- ఆ 100 మందిలో భయం పుడుతుంది : సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి