ఇది మాములు సైకిల్ కాదు... - నాన్నకు ప్రేమతో
పాతసైకిల్ను తండ్రికి కొత్తగా అందించాలనే ఓ కొడుకు తపన వినూత్న ప్రయోగానికి నాంది పలికింది. 26 ఏళ్లుగా తన తండ్రికి సైకిల్‌తో ఉన్న బంధాన్ని చిరకాలం కొనసాగేలా చేశాడు ఆ తనయుడు.
తండ్రి వాడిన పాత సైకిల్‌కే ఇంజిన్, లిథియం బ్యాటరీ అమర్చాడు. ఇంటర్నెట్కు అనుసంధానం చేశాడు. మూడు విధాలుగా ప్రయాణించేలా రూపకల్పన చేశాడు. తొక్కడంతో పాటు బ్యాటరీ సహాయంతో నడవడం, బ్యాటరీ డౌన్ అయితే... ఇంధనంతో నడవడం దీని ప్రత్యేకత. సాధారణ ద్విచక్రవాహనాల కంటే పూర్తి స్థాయిలో శబ్ద, వాయు కాలుష్యం లేకుండా ఈ హైబ్రిడ్ సైకిల్‌ను తీర్చిదిద్దాడు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 130 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
హైదరాబాద్‌లోని ఇండియా సాఫ్ట్ సదస్సులో ఈ హైబ్రిడ్ సైకిల్‌ను వివిధ ఐటీ సంస్థలకు పరిచయం చేశారు. అజయ్ తయారు చేసిన ఈ సైకిల్‌ను చూసిన బెంగళూరులోని అసెంట్ ఇంజినీరింగ్ టెక్నాలజీ సంస్థ వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ముందుకొచ్చింది. ఎలక్ట్రానిక్స్, పరిశ్రమల్లో వృథాగా పడి ఉన్న వస్తువులను పునర్వియోగంలోకి తీసుకొచ్చే ఈ సంస్థ... హైబ్రిడ్ సైకిల్‌కు అండగా నిలిచింది. తండ్రికి మరిచిపోలేని జ్ఞాపకాన్ని తిరిగిచ్చిన అజయ్.. పనిలో పనిగా పర్యావరణానికి మేలుచేశాడు.