దిల్లీ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో డిగ్రీ చేసిన దివ్య.. ఇరవై ఏళ్లుగా విద్యారంగంలో ఉన్నారు. దివ్య తల్లి డాక్టర్, తండ్రి సైంటిస్ట్. విద్య విలువ తెలిసినవాళ్లు కాబట్టి కుమార్తె ఆ రంగంలో అడుగుపెడతానంటే ప్రోత్సహించారు. మొదట ఎన్‌ఐఐటీలో కంప్యూటర్ పాఠాల్ని బోధించేవారు దివ్య. ఆ సమయంలో సాంకేతికతను ఉపయోగించి ‘స్మార్ట్ క్లాస్‌రూమ్’ని తేవాలనుకున్నారు.
ఆ క్రమంలో ఎడ్యుకంప్, ఎడ్‌బిక్స్ లాంటి కంపెనీల్ని ప్రారంభించారు. మారుతున్న అవసరాల్ని గుర్తించి 2017లో ‘ఫ్లిప్‌లెర్న్’ను తీసుకొచ్చారు. తమ వెబ్‌సైట్‌ని ‘టీచింగ్ అండ్ లెర్నింగ్ పోర్టల్’ అని చెబుతారామె. అందుకు కారణం మార్కెట్‌లో ఉన్న చాలా సంస్థలకీ దీనికీ ఉన్న తేడానే. ‘ఫ్లిప్‌లెర్న్‌ద్వారా విద్యకూ, టెక్నాలజీ మధ్య ఉన్న గ్యాప్‌ని తగ్గిస్తున్నాం. మేం కేవలం విద్యార్థులకు డిజిటల్ పాఠాలు చెప్పడమే కాదు, విద్యా సంస్థలకూ ఆన్‌లైన్ సేవలు అందిస్తున్నాం’ అని చెబుతారు దివ్య.
విద్యార్థుల కోసం...
విద్యార్థులకు పర్సనలైజ్డ్ లెర్నింగ్‌ని అందిస్తోంది ఫ్లిప్‌లెర్న్. ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈలతోపాటు అన్ని ప్రధాన రాష్ట్రాల బోర్డులకు సంబంధించి 12వ తరగతి వరకూ డిజిటల్ కంటెంట్‌ను ఇక్కడ పొందొచ్చు. ఫ్లిప్‌లెర్న్ యాప్, వెబ్‌సైట్ ద్వారా ఈ సేవల్ని వినియోగించుకోవచ్చు. పాఠాల్ని ఆకర్షణీయమైన గ్రాఫిక్‌లతో వీడియోలుగా రూపొందించి చెబుతారు వీటిలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి విద్యార్థి నేర్చుకుంటున్న తీరు, వేగాన్ని బట్టి సిలబస్ స్థాయిని మార్చుకుంటూ పాఠాలు బోధిస్తారు. విద్యార్థికి సంబంధించిన వివరాలతో ఒక రియల్‌టైమ్ డ్యాష్‌బోర్డ్ ఉంటుంది. పిల్లలు ఏ విధంగా నేర్చుకుంటున్నారో తెలుసుకోవడానికి టీచర్లు లేదంటే తల్లిదండ్రులు కూడా క్లాసు సమయంలో వేరే డివైస్ నుంచి లాగిన్ అయ్యే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. విద్యార్థులు ఒక తరగతి కోసం వీరి సేవల్ని పొందితే ఆ తరగతికి ముందు, తర్వాత తరగతుల సిలబస్‌లనీ ఉచితంగా చదువుకునే వెసులుబాటు కల్పిస్తారు. సందేహాలు తీర్చడానికి ఆన్‌లైన్ టీచర్ సదుపాయంతోపాటు, 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్ ఉంది. దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు ఫ్లిప్‌లెర్న్ సేవలు పొందుతున్నారు.