ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుండడం వల్ల రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నింటికీ వరద భారీగా వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఆదివారం సాయంత్రానికి 3.13 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దిగువకు మూడు లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల్లోని తుంగభద్ర, జూరాల నుంచి క్రమంగా వరద పెరుగుతుండటం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు.
కృష్ణ, గోదావరి పరివాక జలాశయాలకూ వరద ప్రవాహం..
నాగార్జునసాగర్‌కు 2.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 14 గేట్లు ఎత్తి పులిచింతల వైపు అంతే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు గోదావరి పరీవాహకంలో కూడా జలాశయాలకు ప్రవాహం కొనసాగుతోంది. శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1.46 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా వరద కాలువతో పాటు గేట్లు ఎత్తి దిగువకు అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు.