Liquor Shops Licenses in Telangana :మద్యం దుకాణాలకు లైసెన్స్లు పొందేందుకు రాష్ట్రం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా.. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి భారీ స్పందన వచ్చింది. మద్యం దుకాణాలు దక్కించుకోడానికి వ్యాపారులు భారీ ఎత్తున పోటీ పడ్డారు. దరఖాస్తు ప్రక్రియకు ఇవాళే చివరి తేదీ కావడంతో ఇవాళ ఒక్కే రోజు సుమారు 25వేల అప్లికేషన్స్ వచ్చినట్లు అబ్కారీ శాఖ (Excise Department) అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు సరాసరిగా లక్షా ఏడు వేల అప్లికేషన్లు వచ్చినట్లు అబ్కారీ శాఖ వర్గాలు వెల్లడించాయి. పూర్తి దరఖాస్తులు లెక్కిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
Liquor Income to Telangana Government :2021వ సంవత్సరంలో 69వేలు అర్జీలు రావడంతో తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,357 కోట్లు ఆదాయం వచ్చింది. ఈసారి దాదాపు లక్షపైగా దరఖాస్తులు రావడంతో రూ.2వేల కోట్లు దరఖాస్తుల రుసుం కింద ప్రభుత్వానికి రాబడి వస్తుందని అబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అబ్కారీ శాఖ లెక్కల ప్రకారం.. శుక్లవారం సాయంత్రం 4.30 గంటల వరకు దాదాపు 25వేలు దరఖాస్తులు వచ్చాయి. 4వ తేదీ నుంచి ఇవాళ్టి వరకు 98వేల 959 దరఖాస్తులు వచ్చాయి. కాని సాయంత్రం 6 గంటల వరకు లక్షా ఏడు వేలు దాటినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంతో పాటు బయట రాష్ట్రాల నుంచి కూడా దుకాణాలు దక్కించుకోడానికి భారీ ఎత్తున పోటీ పడ్డారు. గత నాలుగైదు రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేసిన ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం వ్యాపారులు... లాభదాయకంగా ఉండే దుకాణాలు దక్కించుకోడానికి పోటీ పడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, దిల్లీ నుంచి పెద్ద సంఖ్యలో వ్యాపారులు అప్లికేషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం రాష్టవ్యాప్తంగా 2వేల 620 దుకాణాలు ఉండగా.. నాలుగో తేదీ నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే శంషాబాద్ అబ్కారీ జిల్లా పరిధిలో వంద మద్యం దుకాణాలు ఉండగా వాటిని దక్కించుకోడానికి 8వేల 749 అర్జీలు వచ్చాయి.