students suicides in Telangana : ప్రస్తుతం ఇంటర్ ఫలితాలు నేపథ్యంలో రాష్ట్రంలో 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలారు. ప్రతి ఏడాది ఇదే తంతు కొనసాగుతూ వస్తోంది. అయోమయంలో.. అర్ధంలేని నిర్ణయాలను తీసుకుని అర్ధాంతరంగా జీవితాలను ముగిస్తూ కన్నవారికి కడుపుకోత మిగిలిస్తున్నారు. మెరుగైన ప్రతిభ చూపాలనే ఒత్తిడి, పోటీతత్వం, తల్లిదండ్రుల కోరికలను నెరవేర్చలేకపోతున్నామనే ఆందోళన, భవిష్యత్తు లేదనే భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
Inter students suicides in Telangana : పరీక్షల్లో ఫలితాలపై బెంగతో చాలా ప్రాణాలు తీసుకుంటున్నారు. మార్కులు తక్కువొస్తాయేమో అని కొందరు, ఫెయిల్ అయ్యామని మరికొందరు, తక్కువ మార్కులు వచ్చాయని ఇంకొందరు. పదో తరగతిలో మంచి మార్కులు వచ్చాయి ఇంటర్లో అదే స్థాయిలో మార్కులు సాధించలేకపోతున్నామని కొంతమంది విద్యార్థులు ఇలా వివిధ కారణాలతో కఠిన నిర్ణయాలు తీసుకుని తనువు చాలిస్తున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు చదువు నిమిత్తం పట్టణాలకు వస్తుంటారు. దీంతో పిల్లలు తల్లిందండ్రులకు దూరంగా విద్యాసంస్థలకు దగ్గరగా ఉంటూ ఒత్తిడికి గురవుతుంటారు. దీంతో పిల్లలకు రకరకాల ఆలోచనలు భయాందోళనలు కలుగుతుంటాయి. ఆత్మహత్యలకు పాల్పడటం అనేది అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం కాదని సైకాలజిస్టులు అంటున్నారు. జీవితంలో గెలుపు, ఓటములను సమానంగా తీసుకునేలా వారిలో ఆత్మవిశ్వాసం పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. చదువు ఒక్కటే భవిష్యత్తుకు మార్గం కాదనే భావనను పిల్లల్లో పెంపొందించాలంటున్నారు.
ఆచరణలో లేని కౌన్సెలింగ్ వ్యవస్థ : పిల్లలు అధికంగా విద్యాసంస్థల్లోనే గడుపుతుంటారు. కాబట్టి వారి ఆలోచనలను, వారి శైలిని ఉపాధ్యాయిలు పసిగట్టాలి. ఇతర ఆలోచనల నుంచి దూరం చేయడానికి కళాశాలల్లో కౌన్సెలింగ్ విధానాన్ని తీసుకువచ్చినా ఆచరణ సాధ్యం కాలేకపోతోంది. తమకేదైనా సమస్య ఉందని ఎవరైనా వస్తే తప్ప వారిని పట్టించుకోవడంలేదు. పిల్లల్లో మార్పులు, నిరాశ, నిస్పృహ, భిన్న ఆలోచనలు వంటి అంశాలను గుర్తించకపోవడంతో సమస్య తీవ్రత పెరుగుతోంది.
పెరుగుతున్న కేసులు :విద్యార్థుల ఆత్మహత్యలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నట్లు జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండగా రాష్ట్రంలో 2017-21 మధ్య రెండేళ్లు కాస్త తగ్గాయి. అయితే అత్యధికంగా 2021లో పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. 2021లో రాష్ట్రంలో 10,171 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారిలో విద్యార్థులు 567 మంది ఉన్నట్లు ఎన్‌సీఆర్‌బీ తాజా నివేదికలో తెలిపింది. దేశంలో పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే కారణంతో బలవన్మరణాలు చేసుకున్నవారు ఒక శాతంగా ఉన్నారు.