వైద్య విద్యలో... నాలుగున్నరేళ్ల తరగతి గది పాఠాలు ఒక ఎత్తైతే ఏడాది పాటు సాగే ఇంటర్న్ షిప్ మరో ఎత్తు. రోగులకు ఏడాది పాటు సేవలు అందిస్తూ... నేర్చుకున్న పాఠాలను అమలు చేసే ఈ ఇంటర్న్ షిప్కి వైద్య విద్యార్థులు ఎగనామం పెడుతున్నారు. బదులుగా పీజీకి సన్నద్ధమవుతూ... విధులకు గైర్హాజరవుతున్నారని గాంధీ నుంచి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కి ఆకస్మిక బదిలీ అయిన వైద్యుడు వసంత్ ఆరోపించారు.
హాజరుకాని రోజులకు లంచాలు ఇచ్చి... సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారని వెల్లడించారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో... అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని మెడికల్ జేఏసీ సభ్యులు సైతం ఆరోపణలు గుప్పిస్తుండటం గమనార్హం.
తూతూ మంత్రంగా...
రోగులను పరీక్షించి... వైద్య సేవల్లో మెళకువలు నేర్చుకోవడంలో అత్యంత కీలక సమయమే ఇంటర్న్ షిప్. అలాంటిది ఏడాది పాటు సాగే ఈ శిక్షణ కాలాన్ని తూతూ మంత్రంగా జరిపిస్తున్నారనేది ఎంతో కాలంగా ఉన్న వాదన. దీనిపై గతంలో వైద్య విద్య సంచాలకులు త్రిసభ్య కమిటీ వేశారు. ఆ కమిటీ పర్యవేక్షణలో... ఆయా విభాగాల అధిపతులు ఇచ్చిన అనుమతి పత్రాన్ని పరిశీలించి... ఇంటర్న్ షిప్ పూర్తైనట్టు ధ్రువీకరణ పత్రాన్నివ్వాలి. ఈ ప్రక్రియలో అవినీతి నెలకొందని... ఇటీవల గాంధీ నుంచి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కి సరెండరైన వైద్యుడు వసంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. పలువురు వైద్య విద్యార్థుల హాజరు పట్టికకు సంబంధించి... పత్రాలను కూడా చూపిస్తుండటం గమనార్హం.