తెలంగాణ

telangana

ETV Bharat / state

BALAPUR LADDU: 'తిరుపతి లడ్డూ రుచిని తలపించేలా.. ఈసారి బాలాపూర్​ లడ్డూ'

వినాయక చవితి ఉత్సవాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ మహాగణపతి తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన వినాయకుడు బాలాపూర్ గణేశుడు. భక్తుల పాలిట కొంగుబంగారంగా పిలుచుకునే బాలాపూర్ గణేశుడి చేతిలో ఉన్న లడ్డూ.. ఏటా వేలంపాటతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. కరోనా కారణంగా గతేడాది వేలంపాటను రద్దు చేసిన బాలాపూర్ ఉత్సవ సమితి.. ఈ ఏడాది సంబురాల్లో మరింత జోరుగా లడ్డూ వేలంపాట నిర్వహించబోతుంది. గత 15 ఏళ్లుగా బాలాపూర్ గణేశుడికి లడ్డూను అందిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్న ఉమామహేశ్వరావు దంపతులతో మా ప్రతినిధి సతీశ్​ ముఖాముఖి.

BALAPUR LADDU
బాలాపూర్​ లడ్డూ

By

Published : Sep 10, 2021, 7:11 PM IST

సికింద్రాబాద్​ ఏఎస్ రావు నగర్​లోని హానీఫుడ్స్ అధినేత ఉమామహేశ్వరరావు ప్రతి ఏడాది.. 21 కిలోల లడ్డూను తయారుచేసి బాలాపూర్ గణేశుడికి ప్రసాదంగా అందిస్తారు. అయితే ఈ సారి తిరుమల లడ్డు అంత రుచిగా ఉండేలా బాలాపూర్ గణేశుడికి లడ్డూను తయారు చేసిన ఉమామహేశ్వరరావు దంపతులు.. మేళ తాళాల మధ్య ఊరేగింపుగా లడ్డూను బాలాపూర్​ తీసుకెళ్లారు.

మేళతాళాలతో బాలాపూర్ గణేశ్​కి​ గణనాథుడికి ఊరేగింపుతో లడ్డూ బహుకరణ

గత పదిహేనేళ్లుగా భక్తి శ్రద్ధలతో మాల ధరించి ఎంతో నిష్ఠతో లడ్డూ తయారీ చేపడుతున్నాం. శనగపిండి మర పట్టించకుండా స్వయంగా ఆడించి పిండి చేస్తాం. ఆ పిండిలో పాలు కలిపి.. సుగంధ ద్రవ్యాలను జోడించి తయారు చేస్తాం. లడ్డూ తయారీ కోసం ప్రత్యేకంగా చక్కెర తెప్పిస్తాం.

మొదటిసారి మేము బాలాపూర్​ లడ్డూ తయారీని దక్కించుకున్నప్పుడు ప్లాస్టిక్​ కవర్​లో పెట్టి ఇచ్చాం. అప్పుడు అసంతృప్తిగా అనిపించింది. ఇంకా స్టీలు, ఇత్తడి, పంచలోహాలతో తయారుచేసిన పాత్రల్లో పెట్టి ఇచ్చాం. కొన్నేళ్లుగా వెండి పళ్లెంలో పెట్టి ఇస్తున్నాం. అది కూడా తృప్తినివ్వలేదు. ఎప్పటికైనా బంగారు పళ్లెంలో పెట్టి ఆ గణనాథుడికి లడ్డూ ఇవ్వాలని మా కోరిక. పదిహేనేళ్లుగా బాలాపూర్​ గణనాథుడికి లడ్డూను అందించడం అదృష్టంగా భావిస్తున్నాం. బాలాపూర్​ లడ్డూకు ఒక ప్రత్యేకత ఉండేలా.. ఈసారి తిరుమల తిరుపతి లడ్డూ రుచితో ఈ ప్రసాదాన్ని తయారు చేశాం. స్వామి ఆశీస్సులతోనే మేము ప్రతి యేటా లడ్డూను అందించగలుగుతున్నాం. -ఉమామహేశ్వరరావు, హనీఫుడ్స్​ అధినేత, బాలాపూర్​ లడ్డూ తయారీదారు

హనీఫుడ్స్​ అధినేతతో ఈటీవీ భారత్ ప్రతినిధి ఇంటర్వ్యూ

బాలాపూర్ గణపతి లడ్డూ వేలం పాటకు పాతికేళ్లుగా ప్రత్యేకత ఉంది. 2018 వేలంలో 16 లక్షల 60 వేల రూపాయలు పలికిన ధర... 2019లో 17లక్షల 60 వేల రూపాయలకు చేరింది. అయితే గతేడాది కరోనా కారణంగా బాలాపూర్​ గణపతి ఉత్సవ కమిటీ లడ్డూ వేలం పాట నిర్వహించలేదు. ఆ ప్రసాదాన్ని సీఎం కేసీఆర్​కు అందజేశారు.

అలా మొదలైంది

గ్రామాభివృద్ధి కోసం మొదలు పెట్టిన బాలాపూర్ లడ్డూ వేలం పాట.. లంబోదరుడి కటాక్షంతో నిర్విఘ్నంగా కొనసాగుతూ ఈ గ్రామ రూపురేఖలను మార్చివేసింది. మొదట 1994లో రూ. 450తో వేలం పాట ప్రారంభమైంది. 2017లో నాగం తిరుపతి రెడ్డి 15 లక్షల 60 వేలకు లడ్డూను అందుకున్నారు. 2018లో స్థానికేతరుడైన తేరేటి శ్రీనివాస్ గుప్తా 16 లక్షల 60 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వందల, వేలు దాటి లక్షల రూపాయలు పలికి రికార్డు స్థాయికి చేరింది. లడ్డూ దక్కించుకున్న వారికి బాగా కలిసి వస్తుండటమే ఇందుకు కారణం. లడ్డూ దక్కించుకున్న వారి ఇంట సిరిసంపదలతో పాటు వ్యాపారం బాగా కలిసి వస్తుండటం వల్ల ప్రతి ఏటా తీవ్రమైన పోటీ నెలకొంటోంది. అందుకే ఈ ఏడాది జరగబోయే వేలంలో మరి బాలాపూర్​ గణపయ్య లడ్డూ ధర ఎంత పలుకుతుందోనని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండి:CM KCR: కుటుంబసభ్యులతో కలిసి పండుగ జరుపుకున్న సీఎం కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details