తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌కు పచ్చని తోరణాలు.. 300 ట్రీ పార్కులకు ప్రణాళికలు

హైదరాబాద్‌ మహా నగరం చుట్టు 300 ట్రీ పార్కులను అభివృద్ధి చేసేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆహ్లాదకరంగా సేద తీరేలా నీడనిచ్చే మొక్కలు, అలంకరణ, సువాసన వెదజల్లే పూలు, ఔషధ మొక్కలను నాటుతారు. ల్యాండ్‌ స్కేప్‌ పనులు చేపడతారు. రాయి లేదా చెక్కతో చేసిన శిల్పాలను ఏర్పాటు చేస్తారు. కూర్చునేందుకు వీలుగా బల్లలు, పిల్లలకు ఆట సౌకర్యాలను కల్పిస్తారు.

HMDA
HMDA

By

Published : Jun 18, 2020, 11:35 AM IST

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ శివారు ప్రాంతాలను నగరానికి పచ్చని తోరణాలుగా తీర్చిదిద్దేందుకు హెచ్‌ఎండీఏ రంగంలోకి దిగింది. ఆహ్లాదకరంగా సేద తీరేలా 300 ట్రీ పార్కులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో కొత్తగా ఏర్పడిన మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై ప్రత్యేకంగా దృష్టి సారించనుంది.

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా..

ఒకప్పుడు కనుచూపు మేరలో ఇల్లు కనిపించని చోట కూడా ఇప్పుడు కాలనీలు వెలిశాయి. కొత్తగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. వాణిజ్య కార్యకలాపాలు జోరందుకున్నాయి. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హెచ్‌ఎండీఏ శివారు ప్రాంతాల్లో వసతుల కల్పన, ఇతర అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. ఆ క్రమంలోనే చాలాచోట్ల కనీసం సేద తీరేందుకు పార్కులు కూడా లేవని గుర్తించింది. అక్కడక్కడ ఉన్నా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో రూపు కోల్పోయినట్లు తేలింది. ఇదీ కాకుండా చాలా ప్రాంతాల్లో భారీ పార్కులను అభివృద్ధి చేసేందుకు స్థలం అందుబాటులో లేదు. ఇలాంటి తరుణంలోనే ఉన్న తక్కువ స్థలంలోనే ట్రీ పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

ఏమేం చేస్తారు..

ట్రీ పార్కులను అభివృద్ధి చేసేందుకు స్థలాలను చూపించాలంటూ ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను హెచ్‌ఎండీఏ అధికారులు కోరతారు. వాళ్లు చూపించిన స్థలం విస్తీర్ణం ఆధారంగా అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి ప్రణాళికలు రూపొందిస్తారు. నీడనిచ్చే మొక్కలు, అలంకరణ, సువాసన వెదజల్లే పూలు, ఔషధ మొక్కలను నాటుతారు. ల్యాండ్‌ స్కేప్‌ పనులు చేపడతారు. రాయి లేదా చెక్కతో చేసిన శిల్పాలను ఏర్పాటు చేస్తారు. కూర్చునేందుకు వీలుగా బల్లలు, పిల్లలకు ఆట సౌకర్యాలను కల్పిస్తారు. స్థలం అందుబాటులో ఉంటే నడక ట్రాక్‌లను కూడా నిర్మిస్తారు. నిర్వహణ బాధ్యతను సంబంధిత కార్పొరేషన్‌ లేదా మున్సిపాలిటీలకు అప్పగిస్తారు.

ఈ ఏడాది 5 కోట్ల మొక్కలు..

ఈ ఏడాది హరితహారంలో భాగంగా కోటికిపైగా మొక్కలను నాటేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అందుకు అనుగుణంగానే నర్సరీల్లో మొక్కలను పెంచారు. తాజాగా పురపాలక శాఖ కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌.. 5 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు, ఓఆర్‌ఆర్‌, చెరువులు, కుంటల దగ్గర నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఇదీ చదవండి:లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్‌ సందేహానికి ప్రధాని స్పష్టత

ABOUT THE AUTHOR

...view details