తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగర్‌ మరింత శోభితం... రూ.14.5 కోట్లతో మరిన్ని సొబగులు

ట్యాంక్‌బండ్‌కు అదనపు సొబగులు అద్ది ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమైంది. పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఓపెన్ జిమ్, నడకదారి, మిరుమిట్లు గోలిపే విద్యుద్దీపాలను ఏర్పాటు చేయనుంది. సందర్శకులు సేద తీరేలా పెవిలియన్స్‌, బెంచీలను ఏర్పాటుచేస్తారు. రంగురంగుల పూలు, అలంకరణ మొక్కలను నాటనున్నారు.

tank bund
tank bund

By

Published : Aug 31, 2020, 10:48 AM IST

భాగ్యనగరానికి తలమానికమైన హుస్సేన్‌ సాగర్‌కు మరిన్ని సొబగులను అద్దేందుకు హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) సన్నద్ధమయ్యింది. రూ.14.5 కోట్లతో 2.2 కి.మీ.ల ట్యాంక్‌బండ్‌ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. బహిరంగ వ్యాయామశాల(ఓపెన్‌ జిమ్‌) సహా చుట్టూ 14 కి.మీ.ల నడక దారి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలను ఏర్పాటు చేయనుంది. టెండర్లను ఆహ్వానించింది.

కళావిహీనం.. ప్రమాదకరం...

1563లో నగర తాగునీటి అవసరాలకు హుస్సేన్‌సాగర్‌ను తవ్వించారు. రాకపోకలకు వీలుగా 1946లో ట్యాంక్‌బండ్‌ రోడ్డు విస్తరణ చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ హయాంలో పర్యాటక సొబగులద్దారు. ఫౌంటెయిన్లు, విద్యుద్దీపాలు, మహానీయుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. తర్వాత పెద్దగా పట్టించుకోకపోవడంతో కళావిహీనంగా మారింది. నిమజ్జనాలకు క్రేన్లు, భారీ వాహనాలు రావడంతో కాలిబాటలు పూర్తిగా దెబ్బతిని ప్రమాదకరంగా మారాయి. కూర్చొని సేద తీరేందుకు అవకాశం లేని పరిస్థితి. సందర్శకుల ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ తరుణంలోనే ట్యాంక్‌బండ్‌కు మరిన్ని పర్యాటక హంగులు తేవాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది.

360 డిగ్రీల కోణంలో...

హెచ్‌ఎండీఏ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి రూ.14.2 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. కాలిబాటలను నిర్మించనున్నారు. సందర్శకులు సేద తీరేలా పెవిలియన్స్‌, బెంచీలను ఏర్పాటుచేస్తారు. రంగురంగుల పూలు, అలంకరణ మొక్కలను నాటనున్నారు. అత్యాధునిక వసతులతో కూడిన మరుగుదొడ్లను అందుబాటులోకి తేనున్నారు. తెలంగాణ చరిత్రకు అద్దంపట్టే అలంకరణ, శిల్పాలను పెట్టనున్నారు. సాగర్‌ చుట్టూ 360 డిగ్రీల కోణంలో నెక్లెస్‌రోడ్డు మీదుగా నడక దారినీ అభివృద్ధి చేస్తారు.

ఆత్మహత్యలకు ఆస్కారం లేకుండా..

గత మూడేళ్లలో సాగర్‌ వద్ద ఆత్మహత్యకు యత్నించిన 1354 మంది ప్రాణాలను లేక్‌ పోలీసులు కాపాడారు. పికెట్స్‌ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఒడ్డున గోడలకు చెట్ల పొదలు ఏపుగా పెరిగాయి. ఆత్మహత్యలకు పాల్పడేవారు వీటి చాటున నక్కి ఉండడం వల్ల కాపాడలేక పోతున్నామని పోలీసులు చెబుతున్నారు. వీటిని తొలగించేందుకు బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ(బీపీపీఏ) ముందుకొచ్చింది. సాగర్‌ చుట్టూ ముఖ్యంగా ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లోని చెట్లు, పొదలను తొలగించనుంది.

  • అభివృద్ధి చేయనున్న ట్యాంక్‌బండ్‌ రోడ్డు విస్తీర్ణం 2.2 కి.మీ.
  • వ్యయం రూ.14.5 కోట్లు
  • అందుబాటులోకి రానున్నవి నడకదారి.. 14 కి.మీ(చుట్టూ), ఓపెన్‌ జిమ్‌

ఇదీ చదవండి:స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు

ABOUT THE AUTHOR

...view details