తెలంగాణ

telangana

ETV Bharat / state

Clay Ganesh: పర్యావరణ హితం... హెచ్​ఎండీఏ అభిమతం..

ప్రకృతి పండుగైన వినాయక చవితికి మళ్లీ ఆ ప్రకృతి వద్దకే చేర్చేందుకు హెచ్​ఎండీఏ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నుంచి మట్టి గణపయ్యగా మార్చేందుకు తన వంతు కృషిచేస్తోంది. పర్యావరణంపై అవగాహన పెంచేందుకు ప్రతి సంవ‌త్సరంలాగే ఈ ఏడాది కూడా గ్రేట‌ర్ హైద‌రాబాద్​లో మట్టి వినాయకుల పంపిణీ చేపట్టింది. ఈసారి 70 వేల విగ్రహాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

clay ganesh
వినాయక చవితి

By

Published : Sep 8, 2021, 8:32 AM IST

వినాయక చవితి (Vinayaka chavithi) సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఎక్కువగా ఇళ్లలో కూడా చిన్న వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తారు. రసాయనాలతో చేసిన విగ్రహాలతో ఎక్కువగా పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉండడం వల్ల మట్టి వినాయకులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా హైదరాబాద్ జంట నగరాల్లో ఏటా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తోంది. హెచ్ఎండీఏ గత తొమ్మిది ఏళ్లుగా మ‌ట్టి వినాయ‌కుల‌ను ప్రోత్సహిస్తూ... పంపిణీ చేస్తోంది. సంప్రదాయ మట్టి వినాయక విగ్రహాలను కుమ్మరి కుల వృత్తిదారులతో తయారు చేయించి హెచ్ఎండీఏ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల, కాలనీ బృందాలతో ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. 2019లో 40 వేలు, 2020లో 55 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేసింది. ఈ ఏడాది కూడా 70 వేల మట్టి వినాయ‌కుల‌ను న‌గ‌ర ప్రజ‌ల‌కు పంపిణీ చేయాల‌ని హెచ్ఎండీఏ ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఈనెల 4 నుంచి పంపిణీ ప్రారంభించగా.. ఇప్పటి వరకు 40 వేల విగ్రహాల పంపిణీ పూర్తయినట్లు హెచ్ఎండీఏ అధికారులు వెల్లడించారు.

రూ.26 లక్షల వ్యయం...

కుమ్మరి కుల‌స్థుల‌తో హెచ్ఎండీఏ 70 వేల మట్టి గణపతి విగ్రహాల తయారీ బాధ్యతలను అప్పగించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని దాదాపు 250 మంది కుమ్మరి కుల వృత్తిదారుల కుటుంబాలకు విగ్రహాల తయారీ అప్పగించారు. ఈ ఏడాది ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యావంతులు భాగస్వామ్యం కావడం విశేషం. క‌రోనా సమయంలో అన్ని రకాల విద్యా సంస్థలు, యూనివర్సిటీలు మూసివేయడం వల్ల ఇంటి వద్ద ఉంటున్న కుమ్మరి యువత మట్టి గణపతి విగ్రహాల తయారీ చేశారు. వీటి తయారీకి మొత్తం రూ.26 ల‌క్షలు హెచ్ఎండీఏ చెల్లించింది.

38 కేంద్రాల్లో...

మట్టి విగ్రహాల తయారీలో శిక్షణ పొందిన కుమ్మరి కులస్థులు నెలరోజులుగా హెచ్ఎండీఏ గణపతి విగ్రహాలను తయారు చేశారు. వీరంతా రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రోత్సాహంతో రెండేళ్ల క్రితం స్వామి రామానంద తీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్​లో ఆధునిక మట్టి పాత్రల తయారీ రంగంలో 320 మంది మాస్టర్ ట్రైనర్స్ స్కిల్ డెవలప్​మెంట్ ట్రైనింగ్ పూర్తి చేశారు. గ్రేట‌ర్ ప‌రిధిలో హెచ్ఎండీఏ మట్టి విగ్రహాలను 38 కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేస్తోంది.

ఒక్కోరోజు ఒక్కో ఏరియాలో...

ఒక్కోరోజు కొన్ని కేంద్రాల్లో పంపిణీ చేస్తున్నారు. అమీర్​పేట్ హెచ్ఎండీఏ కార్యాల‌యం, కేబీఆర్ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్స్, జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి, హైటెక్ సిటీ, శిల్పారామం, ఉప్పల్ శిల్పారామం, దుర్గం చెరువు ఆవ‌ర‌ణ‌లో పంపిణీ చేస్తున్నారు. వీటితో పాటు మొబైల్ బృందాలు కూడా పలు కాలనీలు తిరిగి విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. మరికొన్ని కాలనీల దగ్గరకు వెళ్లి సైతం మట్టి విగ్రహాలను అందిస్తున్నారు.

Clay Ganesh: పర్యావరణ హితం... హెచ్​ఎండీఏ అభిమతం..

'ప్రతి సంవత్సరం మట్టి గణపతులపై అవగాహన పెంచడానికి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గత రెండేళ్లలో అంటే 40, 55 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేశాం. ఈసారి 70వేల మట్టి విగ్రహాలు పంపిణీ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈనెల 4 నుంచి 9 వరకు విగ్రహాల పంపిణీ కొనసాగుతుంది. ప్రతిరోజు ఛార్ట్ విడుదల చేస్తున్నాం. ఏ సెంటర్​లో ఎక్కడెక్కడ విగ్రహాలు పంపిణీ చేస్తున్నామనే విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాం. దశల వారీగా 38 సెంటర్లలో విగ్రహాల పంపిణీ చేస్తున్నాం. 70 వేల విగ్రహాలకు గానూ రూ.26 లక్షల వ్యయం అయింది. కుమ్మరి సంఘాల వారితో ఒప్పందం కుదుర్చుకుని వీటిని తయారు చేశాం. హైదరాబాద్ జంట నగరాల్లో ప్రతి ఒక్క ఇంట్లో మట్టి గణపతులనే పూజించాలనేదే హెచ్​ఎండీఏ నినాదం.'

-- దేవేందర్​ రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హెచ్ఎండీఏ

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details