హైదరాబాద్లోని అగ్రిగోల్డ్ కార్యాలయ భవనానికి ఆంధ్రాబ్యాంకు వేసిన వేలాన్ని తెలంగాణ హైకోర్టు ఆమోదించింది. పంజాగుట్టలోని అగ్రిగోల్డ్ కార్యాలయంతో పాటు మరో భవనానికి నిర్వహించిన వేలాన్ని ఆమోదించాలని కోరుతూ ఆంధ్రాబ్యాంకు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.అమర్నాథ్ గౌడ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వేలంలో రెండు భవనాలకు కలిపి సుమారు 17 కోట్ల రూపాయలు వచ్చాయని ఆంధ్రాబ్యాంకు తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
ఆంధ్రాబ్యాంకు వేలం వేసిన అగ్రిగోల్డ్ ఆస్తులకు హైకోర్టు ఆమోదం
17:23 December 15
ఆంధ్రాబ్యాంకు వేలం వేసిన అగ్రిగోల్డ్ ఆస్తులకు హైకోర్టు ఆమోదం
హైకోర్టు ఆమోదిస్తే బిడ్డర్లకు అప్పగిస్తామన్నారు. వేలంలో అమ్మడంపై తనకు అభ్యంతరం లేదని.. అయితే ఆ భవనాల్లో ఉన్న దస్త్రాలు తీసుకునేందుకు అనుమతివ్వాలని అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది కోరారు.
తక్కువ ధరకే ఆస్తులు అమ్మారని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తరఫు న్యాయవాది వాదించారు. ప్రతీ దానికి అడ్డుపడ వద్దని అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం.. బ్యాంకు సొమ్ము కూడా ప్రజలదేనని తెలిపింది. ఆంధ్రాబ్యాంకు వేలాన్ని ఆమోదించిన హైకోర్టు... కొనుగోలుదారులకు ఆ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అగ్రిగోల్డ్ కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: నిబంధనలు గాలికొదిలేశారు.. స్కూల్లో పరీక్షలు నిర్వహించేశారు..!