తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ నగరానికి ఏమైంది..! ఓవైపు కరోనా.. మరోవైపు ఎండ - నగరంలో పెరుగుతున్న కరోనా కేసులు

ఓ వైపు కరోనా... మరోవైపు ఎండ...నగరవాసులతో ట్వంటీ-ట్వంటీ ఆడుకుంటున్నాయి. కొన్ని రోజులుగా ఎండలు మండి పోతూ... ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. లాక్​డౌన్ సడలింపులతో కార్యాలయాలకు, పనులకు వెళ్లే వారు... ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్నారు.

high temperatures in Hyderabad
కరోనా, ఎండలతో అల్లాడిపోతున్న నగరవాసులు

By

Published : May 23, 2020, 10:25 AM IST

భానుడు భగ్గుమంటున్నాడు. భాగ్యనగరం నిప్పుల కొలిమిలా మారింది. కరోనా భయంతో లాక్‌డౌన్‌తో ఇన్నాళ్లు ఇళ్లకే పరిమితమై.. ఆంక్షల సడలింపుతో బయటకు వచ్చారో లేదో నగరవాసిని ఎండలు భయపెడుతున్నాయి. శుక్రవారం గరిష్ఠంగా పలు ప్రాంతాల్లో 43 డిగ్రీలపైన పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బయట వేడిగాలులకు తాళలేక ఇళ్లకే ఎక్కువ మంది పరిమితమయ్యారు. సాధారణంగా ఫిబ్రవరి ఆఖరి నుంచి ఎండలు దంచికొడతాయి. ఈసారి మే మూడోవారం వరకు మధ్యమధ్యలో మినహా సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. వేసవి ముగియడానికి మరికొద్దిరోజులు మాత్రమే ఉండటంతో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. దీనికి తుపాను తోడవడంతో గాలిలో తేమ శాతం తగ్గిపోయి పొడిగాలులతో ఎండల తీవ్రత రాజధానిలో పెరిగింది. ఈ వేసవిలో ఇవే అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు. రాబోయే రోజుల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇలా చేస్తే మేలు..

  • వేసవిలో చెమటతో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. రోజూ ఏదో రూపంలో 4 నుంచి 5 లీటర్లు ద్రవపదార్థాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • నీళ్లు మాత్రమే తీసుకోకుండా ఉప్పు, కొంచెం చక్కెర కలిపిన నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్‌ ద్రావణం కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండాలి.
  • ఇంట్లో ఐస్‌ లేకుండానే నిమ్మరసం, మజ్జిగ ఇతర జ్యూసులు తయారు చేసుకోవడం మంచిది.
  • వేసవిలో వేపుడు పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. నీటి శాతం అధికంగా ఉండే ఆకు కూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
  • మద్యపానానికి దూరంగా ఉండాలి. పగటి పూట ఎండలో మద్యం తాగడం మరింత హాని చేస్తుంది. వడదెబ్బకూ దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
  • కిడ్నీ, గుండె సంబంధిత తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు ఎండలోకి వెళ్లకపోవడమే ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details