తెలంగాణ

telangana

ETV Bharat / state

High Court: 'అధికారుల వేతనాలు ఆ దంపతులకు ఇస్తే మేలు'

వృద్ధ దంపతులు రోడ్లు పూడ్చడంపై హైకోర్టులో విచారణ జరిగింది. పింఛను డబ్బుతో గుంతలు పూడుస్తున్నారన్న పత్రికా కథనంపై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. వృద్ధ దంపతులు మరమ్మతులు చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.

High Court
హైకోర్టు

By

Published : Jul 14, 2021, 6:01 PM IST

Updated : Jul 14, 2021, 8:02 PM IST

హైదరాబాద్​లోని రోడ్ల దుస్థితి చూసి వృద్ధ దంపతులు సొంత సొమ్ముతో మరమ్మతులకు నడుం బిగించారంటే.. అది జీహెచ్ఎంసీకి సిగ్గు చేటని హైకోర్టు ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. రోడ్డు డాక్టర్​గా సుపరిచితుడైన కె.గంగాధర్ తిలక్ దంపతులు తమ ఫించను డబ్బులతో రోడ్లపై గుంతలు పూడుస్తున్నారని ఓ ఆంగ్ల పత్రికలో ప్రచురితమైన కథనాన్ని సీజే జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించింది. వృద్ధ దంపతులు రోడ్లపై గుంతలు పూడుస్తున్నారంటే.. జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నట్లని హైకోర్టు ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ అధికారుల వేతనాలు తిలక్ దంపతులకు ఇవ్వడం మేలని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయ పడింది.

తనిఖీ చేయించమంటారా..?

రోడ్ల మరమ్మతుల వంటి పనులు చేయనప్పుడు జీహెచ్ఎంసీకి బడ్జెట్ ఎందుకు తగ్గించకూడదని ప్రశ్నించింది. ప్రమాదాల్లో ప్రజల ప్రాణాలు పోతుంటే.. అధికారులు కూర్చొని చూస్తున్నారా అని వ్యాఖ్యానించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా నగరంలో అద్భుతమైన రోడ్లు, బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది పాశం కృష్ణారెడ్డి తెలిపారు. రోడ్లపై గుంతలే లేవా... న్యాయవాదుల కమిషన్ ఏర్పాటు చేసి తనిఖీలు చేయించమంటారా అని హైకోర్టు పేర్కొంది. రోడ్లు బాగుచేసేందుకు వర్షాకాలం సన్నద్ధత ఏమిటో తెలపాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. జోన్ల వారీగా జోనల్ కమిషనర్లు, సూపరింటెండెంట్ ఇంజినీర్లు నివేదికలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ వారం రోజులకు వాయిదా వేసింది.

హైదరాబాద్​కు చెందిన గంగాధర్ తిలక్, వెంకటేశ్వరీ దంపతులు 2010 నుండి ఓ కారులో రోడ్ బ్రాండ్ మెటీరియల్ తీసుకుని వెళ్లి గుంతలను పూడుస్తున్నారు. తమ కారుకు పాత్ హోల్ అంబులెన్స్ అని పేరు కూడా పెట్టారు. ఎక్కడైనా గుంత కనిపిస్తే వెంటనే కారు ఆపి ఆ గుంతను పూడ్చేస్తారు. వీరు ఎవరి వద్ద నుండి ఈ పనుల కోసం విరాళాలను సేకరించడం లేదు. వారు తమ ఫించన్ డబ్బులనే ఈ గుంతలను పూడ్చడానికి ఖర్చు చేస్తున్నారు. తిలక్ రిటైర్డ్ రైల్వే అధికారి.

ఇదీ చదవండి:'గల్వాన్​లో మరోసారి భారత్​-చైనా సైనికుల ఘర్షణ!'

Last Updated : Jul 14, 2021, 8:02 PM IST

ABOUT THE AUTHOR

...view details