బ్యాంకింగ్ నేరాలు ఆర్థిక వ్యవస్థకు శాపంగా పరిణమించాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. బ్యాంకులను మోసం చేస్తే ప్రజలను చేసినట్లేనని స్పష్టం చేసింది. రుణాలు తీసుకొని దారి మళ్లించి మోసానికి పాల్పడి.. ఆ తర్వాత బ్యాంకులతో సెటిల్ చేసుకున్నంత మాత్రాన క్రిమినల్ కేసు రద్దు కాదని పేర్కొంది. క్యోరో ఓరెమిన్ లిమిటెడ్, ఎండీ ఇషూ నారంగ్, డైరెక్టర్లు చందూలాల్ పటేల్, రుద్రరాజు, శ్రీనివాస్ షా... ఎస్బీఐ, బ్యాంకు ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ, సెంట్రల్ బ్యాంకు నుంచి బొగ్గు వ్యాపారం కోసం సుమారు రూ.134 కోట్ల రుణం పొందారు.
సకాలంలో చెల్లించక పోవటంతో రుణం 241 కోట్ల రూపాయలకు చేరింది. అయితే బ్యాంకులతో ఏకకాల పరిష్కారం విధానం ద్వారా 61 కోట్ల రూపాయలు చెల్లించారు. ఓటీఎస్ ద్వారా సొమ్ము చెల్లించినందుకు తమపై నమోదైన సీబీఐ, ఈడీ కేసులు కొట్టివేయాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ తీర్పు వెల్లడించారు. ఓటీఎస్ కారణంగా బ్యాంకులకు సుమారు 182 కోట్ల నష్టం వాటిల్లిందని.. అదంతా ప్రజల సొమ్మేనని హైకోర్టు పేర్కొంది.