Khairatabad Ganesh: హైదరాబాద్ ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవుదినం కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు పెద్దఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు. ఖైరతాబాద్ చేరుకునే ఎంఎంటీస్ రైళ్లు, మెట్రో రైళ్లు దాదాపుగా ఖైరతాబాద్‌లోనే ఖాళీ అయ్యాయి. క్యూలైన్లలో వారిని అదుపు చేయలేక చేతులెత్తేసిన పోలీసులు.. రోడ్డు మధ్యలో నుంచి భక్తులను పంపించడం మొదలుపెట్టారు. ఈరోజు ఇప్పటివరకు సుమారు 4 నుంచి 5 లక్షల మంది దర్శించుకున్నట్లు అంచనా.
రాత్రి వరకు మరో 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సమీపంలోని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలు ఉండటంతో ఈ ప్రాంతంలో రద్దీ బాగా పెరిగింది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు క్రేన్లను ఏర్పాటు చేసినప్పటికీ మట్టి విగ్రహాలు రాకపోవడంతో అందులో నిమజ్జనాలు జరగడంలేదు. దీంతో హెచ్‌ఎండీఏ మైదానంలో, నెక్లెస్ రోడ్‌లోని హెలీప్యాడ్ వద్ద, సంజీవయ్య పార్కు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక పాండ్లలో నిమజ్జనం చేస్తున్నారు. ఖైరతాబాద్ వద్ద భక్తుల రద్దీతో ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ స్తంభించింది. ట్యాంక్‌బండ్, నాంపల్లి, మాసబ్ ట్యాంక్, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్ నుంచి ఖైరతాబాద్‌కు వచ్చే మార్గాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. సుమారు మధ్యాహ్నం నుంచి కొన్ని గంటలుగా ఇదే పరిస్థితి నెలకొంది. రద్దీని తగ్గించేందుకు ఖైరతాబాద్ మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్సులను తగ్గించి, భక్తులు రైళ్లలో రావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.