ఇక్కడ చూడండి పల్సర్ వాహనంపై ముగ్గురు ప్రయాణం. ఒక్కరికీ హెల్మెట్ లేదు. పైగా ట్రాఫిక్ ఛలాన్ తప్పించుకునేందుకు విన్యాసాలు. ఇలాంటి నిర్లక్ష్యమే వీరి ప్రాణాలు తీసింది. గత సెప్టెంబర్‌లో మద్యం సేవించి మాదాపూర్ దుర్గం చెరువు వద్ద అతి వేగంగా వచ్చి డివైడర్‌ని ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరో ఘటనలో... ముద్దుల కుమారుడు అడిగాడు కదా అని తల్లిదండ్రులు ఖరీదైన డ్యూక్ బైక్ కొనిచ్చారు. కానీ జాగ్రత్తలు చెప్పడం మరిచారు. పరిమితికి మించి వేగానికి... రెండు వేల రూపాయల చలాన్లు స్పీడ్ గన్ ద్వారా పడ్డాయి. కానీ అదే వేగానికి గచ్చిబౌలి నానకరామ్ గూడా వద్ద డివైడర్‌ని ఢీ కొని ప్రాణాలు విడిచాడు.
హెల్మెట్ లేకుండా బండి నడుపుతూ
కూకట్‌పల్లికి చెందిన ఓ రియల్‌ఎస్టేట్ వ్యాపారిది... ప్రతినిత్యం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనే. అతనికి వాహనంపై 12 ఛలాన్లు నమోదయ్యాయి. ఏప్రిల్‌లో కూకట్‌పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. చేవెళ్లకు చెందిన వ్యక్తి హెల్మెట్ లేకుండా బండి నడుపుతూ అదుపు తప్పి రోడ్డుపక్కన పడిపోయాడు. తలకు తీవ్ర గాయమై మృతి చెందాడు. ఇలా నిత్యం తెలిసీ తప్పులు చేస్తూ వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.