గ్రేటర్ పరిధిలో రాత్రి 8 గంటలకు ప్రారంభమైన వర్షం మూడు గంటలపాటు కురిసింది. కుండపోత వానతో రాత్రి రాజధాని వణికిపోయింది. కేవలం మూడు గంటల వ్యవధిలోనే 10సెంటిమీటర్ల వర్షం పడటంతో ఊహించని నష్టం వాటిల్లింది. కాలనీలు, రహదారులు నదులను తలపించాయి. రోడ్లన్నీ మునిగిపోయాయి. వాహనాలు పడవల్లా తేలాయి. కొన్నిచోట్ల కొట్టుకుపోయాయి.అత్యధికంగా జూబ్లీహిల్స్‌లో 9.78 సెంటీమీటర్ల వర్షం పడింది.అల్లాపూర్ వివేకానంద్ నగర్ 9.6, మాదాపూర్‌లో 8.75, మోతీనగర్‌లో 7.98, విరాట్ నగర్ 7.93, యూసఫ్‌గూడ 7.63, బాలానగర్‌లో 7.15 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. జీడిమెట్లలో 5.65, కేపీహెచ్‌బీ 5.68, షాపూర్ నగర్ 5.48, టోలీచౌక్‌లో 5.25, వనస్థలీపురంలో 5.18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నీటమునిగిన వాహనాలు
ఏకధాటిగా కురిసిన వానకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్సార్ నగర్, ఎర్రగడ్డ, శ్రీనగర్ కాలనీ, రాజ్ భవన్ రోడ్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్, ప్రాంతాలు చెరువులను తలపించాయి. ఖైరతాబాద్, కోఠి, దిల్‌సుఖ్ నగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ఆల్విన్ కాలనీ, బాలానగర్, నాచారం, మల్లాపూర్, తార్నాక, ఉప్పల్‌లో కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అమీర్‌పేట మైత్రివనం వద్ద కార్లు నీటమునిగాయి.మూసాపేట,జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో వాహనాలను పోలీసులు దారి మళ్లించారు.చాంద్రాయణగుట్ట నుంచి బండ్లగూడ వెళ్లే దారిపై వరద చేరి రాకపోకలు నిలిచిపోయాయి. పాతబస్తీ బహదూర్‌పురా వద్ద రహదారులు కనిపించలేదు. డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లటంతో చాలా చోట్ల ట్రాఫిక్ భారీగా జాం అయింది.
కొట్టుకుపోయిన తోపుడుబండ్లు