రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం కోసం భూములు ఇచ్చిన వారికి హెచ్ఎండీఏలో వెయ్యి గజాల స్థలాన్ని త్వరలోనే అందజేస్తామని రాష్ట్ర మంత్రులు స్పష్టం చేశారు. హరిత హారంలో భాగంగా మేడిపల్లి రాచకొండ కమిషనరేట్ కార్యాలయ స్థలంలో.. హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి మల్లారెడ్డి, పోలీసు, అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా హరితహారంతో రాష్ట్రమంతటా పచ్చదనం పెరిగిందని మహమూద్ అలీ పేర్కొన్నారు. సామాజిక కార్యక్రమాలతో పోలీసులు ప్రజలకు మరింతగా దగ్గరయ్యారని అన్నారు. ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను ఇలాగే కొనసాగించాలని సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారంలో పోలీసులు భాగం కావడం సంతోషకరం. మేడికొండ రాచకొండ కమిషనరేట్ పరిధిలో లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ మహేశ్ భగవత్‌లకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలి.-మహమూద్ అలీ, హోం మంత్రి
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో మొక్కలు నాటామని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. రాచకొండ కమిషనరేట్ ప్రకృతి ఒడిలో ఉందన్నారు. ఈ సందర్భంగా దేశంలో అత్యధిక సీసీటీవీ కెమెరాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన స్పష్టం చేశారు.