Harish Rao on Cancer Prevention: రాష్ట్రంలో 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో మొబైల్ స్క్రీనింగ్ బస్, ఆధునిక సీటీ స్కాన్ యంత్రం, ఓపీజీ మిషన్లను ప్రారంభించారు. అదే విధంగా రోగి సహాయకులు ఉండేందుకు వీలుగా నీనా రావు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన 300 పడకల వసతి కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
50 శాతం పెరిగాయి
Harish Rao at MNJC: రాష్ట్రంలో వెలుగు చూస్తున్న క్యాన్సర్ కేసుల్లో దాదాపు 22 శాతం నోటి క్యాన్సర్లేనని మంత్రి హరీశ్ రావు తెలిపారు. గత 30 ఏళ్లలో దేశవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు సుమారు 50 శాతం పెరిగాయన్న ఆయన.. ఆహరం, జీవన విధానంలో మార్పులు, ధూమపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండటం ద్వారా కొంతవరకు క్యాన్సర్ రాకుండా జాగ్రత్తపడొచ్చని సూచించారు. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రికి అదనంగా త్వరలో 300 పడకల ఆస్పత్రి బ్లాక్‌ను అరబిందో ఫార్మా సీఎస్ఐఆర్లో భాగంగా నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సుమారు 15,000 మంది క్యాన్సర్ రోగులకు ఏటా ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తోందని స్పష్టం చేశారు.