Harish Rao On Commercial Taxes Conference : వాణిజ్య పన్నుల శాఖ 2022-23 సంవత్సరంలో రూ.72 వేల 564 కోట్ల పన్నుల వసూలుతో లక్ష్యాన్ని సాధించి చరిత్ర సృష్టించిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తద్వారా గడిచిన ఎనిమిదేళ్లలో రాష్ట్ర సొంత రాబడుల వృద్ధి రేటులో దేశంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. పారదర్శక పాలనతోనే ఈ తరహా వృద్ధి రేటు సాధ్యమవుతోందని హరీశ్‌రావు తెలిపారు. హైదరాబాద్ నగరు శివారులోని గోల్కొండ రిసార్ట్స్‌లో జరిగిన వాణిజ్య పన్నుల శాఖ మేధోమథన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఆదాయ వనరుల పెంపుదలపై సదస్సులో చర్చించారు. అనంతరం మాట్లాడిన హరీశ్‌రావు.. దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఇందుకోసం ఖర్చు చేయాల్సిన ధనాన్ని సమీకరించడంలో వాణిజ్య పన్నుల శాఖదే పెద్ద చేయి అని గుర్తు చేశారు.
2023-24లో రూ.85 వేల 413 కోట్లు లక్ష్యంగా నిర్ధేశించినట్లు ప్రకటించిన మంత్రి హరీశ్‌రావు.. కష్టపడి పని చేస్తే రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందని సూచించారు. లక్ష్యాన్ని వాణిజ్య పన్నుల శాఖ ఏ మేరకు చేరుకోగలదన్న అంశంపైనే ప్రభుత్వం నిర్వహిస్తున్న అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆధారపడి ఉంటాయని గుర్తు చేశారు. సమీకరించే ప్రతి రూపాయి సమాజంలోని అట్టడుగు జనాల కోసం వినియోగిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఇంకా పెంచి దేశంలోనే అభివృద్ధికి సూచికగా నిలబెట్టాల్సిన అవసరం అందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పరిహారం తీసుకోని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. దేశ, విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా మంచి విధానాలు ఉంటే అనుసరించాలని.. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే ఏ విషయమైనా నేర్చుకొని రాష్ట్రానికి ఉపయోగపడేలా కృషి చేయాలని మంత్రి సూచించారు.