విశ్వసనీయ సమాచారం మేరకు వామపక్ష తీవ్రవాదంపై దిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో తెలంగాణ పోలీసుశాఖ రూపొందించిన నివేదిక పట్ల కేంద్రం ఆసక్తి కనబరిచింది. మిగతా రాష్ట్రాల్లోనూ ఈ తరహా కార్యకలాపాలు చేపట్టాలని, ఇందుకు తెలంగాణ సాయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వామపక్ష తీవ్రవాదాన్ని అదుపు (Fight Against Maoism) చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కేంద్ర హోంశాఖ ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తోంది. ఆదివారం జరిగిన సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితిని సమీక్షించారు.
రాష్ట్రం ఏర్పడ్డాకా అదే పట్టు...
ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో మాదిరిగానే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హింసాత్మక ఘటనలు జరిగేవి. నియంత్రించడం (Fight Against Maoism) లో ఉమ్మడి రాష్ట్రం విజయవంతమైంది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతా తెలంగాణలో అదే పట్టు కొనసాగుతోంది. ఇందుకోసం తాము చేపట్టిన వివిధ కార్యక్రమాలను దిల్లీ సమావేశంలో అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రహదారులు అభివృద్ధి, సమాచార వ్యవస్థ మెరుగుపరచడంతోపాటు స్థానిక పోలీసులను బలోపేతం చేయడం ద్వారా ఫలితం ఉంటుందని ఇందులో స్పష్టం చేశారు.