Group-2 Candidates Protest Hyderabad : రాష్ట్రంలో ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించ తలబెట్టిన గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్న అభ్యర్థులు.. ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవటంతో పోరుబాట పట్టారు. ఈ నెలారంభం నుంచి 23 వరకు వరుసగా గురుకుల పరీక్షలు ఉండగా.. వెంటనే గ్రూప్-2 పరీక్షలను ఖరారు చేయటంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. గురుకుల, గ్రూప్ -2 సిలబస్ వేర్వేరు కావటంతో రెండింటిలో ఏదో ఒక పరీక్షకు మాత్రమే సన్నద్ధమయ్యే పరిస్థితి ఉంటుందని అభ్యర్థులు వాపోతున్నారు.
Group-2 Candidates Protest at TSPSC Office : : ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి.. హైదరాబాద్ నాంపల్లికి వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు.. టీఎస్‌పీఎస్సీ (TSPSC)ముట్టడికి యత్నించారు. ఉదయం అభ్యర్థులు, విద్యార్థి సంఘాల నేతలు వస్తుండగా పలువురిని అడ్డుకుని.. అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, ఒక్కసారిగా వేలాది మంది తరలివచ్చి కార్యాలయం వద్ద బైఠాయించారు.
గ్రూప్-2 పరీక్షకు ఇలా ప్రిపేర్ అవ్వండి..!
వీరికి టీజేఎస్ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం, కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్.. కోచింగ్ సెంటర్ నిర్వాహకులు అశోక్, రియాజ్ కమిషన్ కార్యాలయం వద్దకు చేరుకుని, అభ్యర్థులకు మద్దతు తెలిపారు.ప్రభుత్వం వాయిదా నిర్ణయం ప్రకటించే వరకు వెనక్కి తగ్గబోమని ఆందోళనకారులు తేల్చిచెప్పారు. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ నేతృత్వంలో అభ్యర్థుల బృందం.. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శికి వినతిపత్రాలు అందజేశారు.
"అన్ని పరీక్షలు వెంటవెంటనే పెడితే ఎలా రాయగలుగుతాం. మేము గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నాం ఏడు సంవత్సరాలు ఖాళీగా ఉండి.. ఒకేసారి అన్ని పరీక్షలు పెడితే ఎలా? మేం శాంతియుతంగానే నిరసన తెలుపుతున్నాం. గ్రూప్ 2 సిలబస్ కూడా మార్చారు.. ప్రిపేర్ అయ్యే సమయం లేదు." - గ్రూప్- 2అభ్యర్థులు
Group 2 Exams Telangana 2023 : గ్రూప్-2 పరీక్షకు TSPSC ఏర్పాట్లు.. త్వరలో ఆ ఫలితాలు.!
Group 2 Exam Postpone Demand :తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ఛైర్మన్ అందుబాటులో లేకపోవటంతో.. కార్యదర్శి అనితా రామచంద్రన్‌ను కలిసి విన్నవించగా.. ఆమె 48 గంటల సమయం అడిగారు. ఆందోళన విరమించి తిరిగి వెళ్లాలని పోలీసులు కోరగా.. ససేమిరా అన్న అభ్యర్థులు పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యాలయం పక్కనున్న మైదానంలో బైఠాయించారు. ప్రభుత్వం ఏదైనా స్పష్టతనిచ్చే వరకు తాము కదలబోమని తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే పరిస్థితి చేయిదాటకుండా బల్మూరి వెంకట్‌తో పాటు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు అశోక్, రియాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.