తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులకు శుభవార్త.. నేటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - telangana farmers news

Paddy Procurement in Telangana: రైతుల ధాన్యం విక్రయ కష్టాలు తీరబోతున్నాయి. ఇవాళ్టి నుంచి కొనుగోలు కేంద్రాలు తెరపబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై చర్చించారు. మార్కెట్​కు వచ్చిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని మంత్రులు ఆదేశించారు.

Ministerial Review Meeting
మంత్రుల సమీక్షా సమావేశం

By

Published : Apr 10, 2023, 9:30 PM IST

Updated : Apr 11, 2023, 6:39 AM IST

Paddy Procurement in Telangana: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, ఎఫ్​సీఐ అధికారులతో మంత్రులు హరీశ్​రావు, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించి జిల్లా స్థాయిలో కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకొని కొనుగోళ్లకు సిద్దం కావాలని స్పష్టం చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని మంత్రులు అధికారులకు చెప్పారు. దానికోసమే రాష్ట్రంలో 7100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఈ నెల 30వ తేదీకి సేకరణ అయిపోవాలి: ధాన్యం దిగుబడికి అనుగుణంగా కేంద్రాలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వారం ధాన్యం కొనుగోళ్లపై మరోమారు సమీక్ష నిర్వహిస్తామని మంత్రులు తెలిపారు. యాసంగికి సీజన్ సీఎంఆర్​ను ఈ నెల 30వ తేదీలోగా మిల్లర్ల నుంచి సేకరించాలని దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటి నుంచి సీఎంఆర్ అప్పగించే విషయంలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా క్షమించేది లేదని హెచ్చరించారు. ఇప్పటి వరకు పెండింగ్​లో ఉన్న సీఎంఆర్​ను అప్పగించి ఈ సీజన్ ధాన్యాన్ని తీసుకోవాలని రైస్ మిల్లర్లుకు సూచించారు.

ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకువచ్చేలా అవగాహన కల్పించాలి: ఇప్పటి వరకు సీఎంఆర్​లో పాల్గొనని మిల్లర్లను కూడా ఈ యాసంగి సీజన్ నుంచి భాగస్వామ్యం చేస్తున్నట్లు మంత్రులు ప్రకటించారు. రైతులు రెండు సీజన్లలో పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే అని పేర్కొన్నారు. ధాన్యం నిల్వలకు ఇంటర్మీడియట్ గోడౌన్లను గుర్తించి తగు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులకు సూచించారు. ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకోచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని మంత్రులు తెలిపారు.

9 సంవత్సరాల్లో ఆరు రెట్లు ధాన్యం కొనుగోలు పెరిగింది: 2014-15లో 3392 కోట్లతో ధాన్యం సేకరిస్తే 2020-21 నాటికి ఆ మొత్తం 26,600 కోట్లకు చేరుకొందని చెప్పారు. తొమ్మిదేళ్లలో ఆరు రెట్ల ధాన్యం కొనుగోలు పెరిగిందని అన్నారు. మిల్లింగ్ సామర్థ్యం రెండు రెట్లు మాత్రమే పెరిగిందని.. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మిల్లర్ల నుంచి సీఎంఆర్ సేకరణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులు సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. ప్రస్తుతం ఉన్న చెక్ పోస్టులను బలోపేతం చేయాలని మంత్రులు ఆదేశించారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం జరగకుండా ధాన్యం కొనుగోలు వివరాలను కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ఎప్పటికప్పడు ఆన్​లైన్​లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 11, 2023, 6:39 AM IST

ABOUT THE AUTHOR

...view details