తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు.. బస్తాకు రెండు కిలోల దోపిడీ..! - సరకు రైస్ మిల్లులకు తరలింపులోనూ ఆలస్యం

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ప్రస్తుత వానాకాల సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు.. గత నెల మూడో వారంలో ప్రారంభమయ్యాయి. రికార్డు స్థాయిలో కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, వాస్తవంగా ఆ మేరకు క్షేత్రస్థాయిలో వేగంగా జరగడం లేదు. ప్రతి గ్రామంలో కాంటాలు, రశీదుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. పౌర సరఫరాల యంత్రాంగం పర్యవేక్షణ కొరవడటం రైస్‌ మిలర్లకు కలిసొస్తుంది. నాణ్యత, తేమ, తూకాల పేరిట కొర్రీలు పెడుతూ బస్తాపై అదనంగా 2 కిలోల చొప్పున అధికంగా తూకం వేస్తూ అన్నదాతలను నిలువుదోపిడీ చేస్తున్నారు.

In Addition Two kilos of Loot Per Bag
In Addition Two kilos of Loot Per Bag

By

Published : Nov 12, 2022, 4:06 PM IST

రాష్ట్రంలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు.. బస్తాకు రెండు కిలోల దోపిడీ..!

రాష్ట్రంలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. నిరుటి కన్నా మూడు లక్షల ఎకరాల్లో అదనంగా వడ్లు పండించారు. దిగుబడి 1.51 కోట్ల టన్నులు వస్తుందని వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసి, పౌర సరఫరాల శాఖకు సమాచారమిచ్చింది. సుమారు 1.12 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు పౌర సరఫరాల సంస్థ ప్రణాళిక రూపొందించింది. 6 వేల 874 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నది అంచనా. ఇప్పటి వరకు 3 వేల 87 కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేశారు. వాటిలో ఇప్పటి వరకు 3.10 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. గడిచిన వానాకాలం సీజన్‌తో పోలిస్తే ఈ మొత్తం చాలా తక్కువని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వ్యాపారులు, మిల్లర్లు పెద్దమొత్తంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.

క్రితంతో పోలిస్తే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు:దాదాపుగా రాష్ట్రంలో చాలాచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు మందగమనంలో సాగుతున్నాయి. ఎనిమిదేళ్ల క్రితంతో పోలిస్తే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఆరు రెట్లు పెరగాయి. ఈసారి 90 లక్షల టన్నుల కంటే ఎక్కువగా కొనుగోలు చేసే రికార్డే అవుతుంది. కోటి టన్నులను అధిగమిస్తే మాత్రం ధాన్యం కొనుగోళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ చరిత్ర సృష్టిస్తుందని అధికారులు చెబుతున్నారు.

కొనుగోలు కేంద్రాల్లో కనీస సదుపాయాలు లేవని రైతులు వాపోతున్నారు. కాంటాలు ఆలస్యం కావడం వల్ల.. వాతావరణం చల్లబడితే చాలు వర్షం వస్తుందేమోనన్న భయంతో కర్షకులు వణికిపోతోన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా లక్ష్యంలో సగం మాత్రమే అంటే 3వేల కొనుగోలు కేంద్రాలు మించి తెరవలేదు.

అందినకాడికి దోచుకోవడమే పనిగా రైస్ మిల్లర్లు, ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల నిర్వాహకులు పనిచేస్తున్నారని సాగుదారులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో ధాన్యం ఆరబోసి కాంటాల కోసం నెలన్నర నుంచి నిరీక్షిస్తున్నారు.

సరకు రైస్ మిల్లులకు తరలింపులోనూ ఆలస్యం:రేపుమాపు అంటూ అధికారులు సమాధానం దాటవేస్తున్నారని నిర్వేదంతో చెబుతున్నారు. తరుగు, తేమ పేరుతో రెండు కిలోల ధాన్యం అదనంగా మిల్లర్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తూకం వేశాక రశీదులివ్వడంలోనూ ఎడతెగని జాప్యం చేస్తున్నారు. లారీల కొరత వల్ల సరకు రైస్ మిల్లులకు తరలింపులోనూ ఆలస్యం చేస్తున్నారు.

మిల్లర్లపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కర్షకులు ఆవేదన చెందుతున్నారు. వడ్లు ఆరబెట్టడం, తూర్పారబట్టం పట్టాలు కప్పడానికి ఖర్చులు తడిసిమోపెడవతున్నాయని వాపోతున్నారు. భూయజమాని ఖాతాల్లో కాకుండా తమ అకౌంట్లలోనే ధాన్యం సొమ్ము పడేలా చూడాలని కౌలు రైతులు వేడుకుంటున్నారు. ధాన్యం కొనుగోళ్లు సత్వరం పూర్తయ్యేలా యంత్రాంగం ప్రత్యేకదృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 2 కిలోలు అదనపు దోపిడీ అరికట్టడంతోపాటు కాంటా పూర్తయిన 48 గంటల్లో సొమ్ము ఖాతాల్లో జమచేసేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details