Teachers Protest: బదిలీలు, పదోన్నతుల చేపట్టాలంటూ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ లక్డీకాపూల్లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యారంగంలో సమస్యలను పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. గత ఏడేళ్లుగా ఉపాధ్యాయ పదోన్నతులు, నాలుగేళ్లుగా బదిలీలు లేవని ఆవేదన చెందారు. జీవో 317ను ఏకపక్షంగా విడుదల చేసి.. 13 జిల్లాలను బ్లాక్ చేసి స్పౌజ్ కేటగిరి టీచర్లకు తీవ్ర అన్యాయం చేశారన్నారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా తమను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఉపాధ్యాయులు ఖండించారు. వివిధ పోలీసు స్టేషన్లలో ఆందోళన కొనసాగిస్తున్నారు. తమ సమస్యలపై ఉన్నతాధికారులు స్పందించకపోగా... పోలీసులతో అరెస్ట్ చేయించడం దారుణమన్నారు. తమ న్యాయమైన సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నారాయణ గూడ , రాంగోపాల్ పేట్, నాంపల్లి పీఎస్ల్లో ఉపాద్యాయులు ధర్నా నిర్వహించారు.