Governor Tamilsai comments on KCR: వరద బాధిత ప్రాంతాలకు తెలంగాణ ముఖ్యమంత్రిని రప్పించిన పేరు తనకి ఉందని తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. తాను వెళ్తున్నానని తెలిశాక ఆ ప్రాంతానికి సీఎం వెళ్తారని చెప్పారు. తెలంగాణ, పుదుచ్చేరిల్లో పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆ కాలంలో చేసిన పనులపై ‘రీ డిస్కవరింగ్ సెల్ఫ్ ఇన్ సెల్ఫ్‌లెస్ సర్వీస్’ అనే పుస్తకాన్ని విడుదల చేసే కార్యక్రమం చెన్నైలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. తాను పనిచేసే చోట ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది కలిగించలేదని, తన పని మాత్రం ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉందని పాలకులు అనుకుంటున్నారన్నారు.
గణతంత్ర దినోత్సవం రోజున తనని జెండా ఆవిష్కరించనివ్వలేదని, ప్రసంగం కూడా చేయనివ్వలేదని చెప్పారు. అయినా తన పని తాను చేసుకుంటూ పోతున్నానన్నారు. గవర్నర్‌గా తనకి అధికారం ఉన్నప్పటికి ప్రత్యేక విమానాన్ని తన ప్రయాణానికి ఉపయోగించలేదన్నారు. తింటున్న భోజనానికి కూడా తెలంగాణ రాజ్‌భవన్‌కి నగదు చెల్లిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. తనకు తెలిసిన ఓ వ్యక్తి ‘తమిళిసై ఎప్పుడూ తమిళనాడులోనే ఉంటున్నారు.
ఆమె గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ, ఇన్‌ఛార్జి ఎల్జీగా ఉన్న పుదుచ్చేరి ఏమవ్వాలి’ అని అన్నారన్నారు. రెండు చోట్ల ఏమీ కాలేదని చెప్పారు. పుదుచ్చేరికి వెళ్లినప్పుడు మాజీ సీఎం నారాయణస్వామి తనపై ‘తెలంగాణలో తరిమికొట్టారా? తరచూ ఇక్కడే ఉంటున్నారు’ అని విమర్శలు చేసినట్లు తమిళిసై తెలిపారు. ఎవరు ఎన్ని చెప్పినా తాను తమిళనాడు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటానని చెప్పారు. తనకి రాష్ట్రపతి అభ్యర్థి అవకాశం వచ్చినా ప్రజలతో కలిసి ఉండాలని భావించానన్నారు.
ఇవీ చదవండి: