Governor distributed Bathukamma sarees: బతుకమ్మలో సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రకృతితో ముడిపడి ఉన్న మహిళల పండుగ అని తెలిపారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు అద్దం పట్టే బతుకమ్మ పండుగ అని పేర్కొన్నారు. బతుకమ్మ రూపంలో గౌరీదేవిని మహిళలు పూజిస్తారని తమిళిసై చెప్పారు.
రాష్ట్ర ప్రజలందరికీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్భవన్లో రేపట్నుంచి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సాధారణ ప్రజానీకానికి కూడా రేపు అనుమతి ఉంటుందని చెప్పారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళా ఉద్యోగులు, సిబ్బందికి గవర్నర్ రాజ్భవన్లో చీరలు పంపిణీ చేశారు. గత మూడేళ్లుగా బతుకమ్మ వేడుకలు నిర్వహించడంతో పాటు.. సొంత ఖర్చులతో ఉద్యోగులు, సిబ్బందికి చీరలు పంపిణీ చేస్తున్నట్లు తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు.