రైతులు పండించిన వరి ధాన్యం సేకరణ కోసం పౌరసరఫరాల సంస్ధ ప్రతి సీజన్ లోనూ గన్నీబ్యాగులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) మార్గదర్శకాలకు లోబడి 46శాతం పాత వాటిని, 54 శాతం కొత్త వాటిని వినియోగించాల్సి ఉంటుంది. కొత్త వాటిని జ్యూట్ కమిషన్ ద్వారా కొనుగోళ్లు చేయాలి. కొత్త బ్యాగులనైతే మూడు మార్లు, పాత బ్యాగులనైతే ఒక మారు ఉపయోగించే అవకాశం ఉంటుంది. జూట్ కమిషన్ ద్వారా కొనుగోలు చేసే ఒక్కో గన్నీబ్యాగు ధర 56 రూపాయలు ఉంటుంది. అదే పాత బ్యాగులను కొనుగోలు చేస్తే ఒక్కొక్కటి 24 నుంచి 26 రూపాయల వరకు పడుతుంది. జూట్ కమిషన్ నుంచి పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసిన గన్నీ బ్యాగులోనే మిల్లర్లు బియ్యాన్ని అందించాల్సి ఉంటుంది. రేషన్ డీలర్లు బియ్యాన్ని వినియోగదారులకు అందించాక ఆ గన్నీబ్యాగును తిరిగి పౌరసరఫరాల సంస్థకు ఇవ్వాలి. డీలర్ల నుంచి సంస్థకు రాకుండా మధ్యదళారులు చక్రం తిప్పుతారు. డీలర్ల నుంచి 22, 23 రూపాయలకు వాటిని దళారులు కొనుగోలు చేసి పౌరసరఫరాల సంస్థకు టెండర్ ద్వారా 24 నుంచి 26 రూపాయల వరకు అమ్ముతారు. దీంతో సంస్థపై ఆరు నుంచి ఎనిమిది రూపాయల వరకు అదనపు భారం పడుతుంది.
పౌరసరఫరాల సంస్థకు అదనపు భారం
తద్వారా పౌరసరఫరాల సంస్థకు ప్రతి సీజన్ లో 200 నుంచి 300 కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడుతోంది. దీంతో ఆ భారం పడకుండా చూసే చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల మిల్లర్లు, డీలర్ల అసోసియేషన్లతో మంత్రి గంగుల కమలాకర్ నిర్వహించిన సమావేశంలో ఈ విషయమై విస్తృత చర్చ జరిగింది. సంస్థపై అదనపు భారం పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పాత గన్నీ బ్యాగుల సరఫరాదార్లతోనూ చర్చించారు. ఇక నుంచి మిల్లర్లు, డీలర్ల నుంచి గన్నీబ్యాగులు విధిగా తిరిగివచ్చేలా నిబంధనలు కఠినతరం చేయనున్నారు. ఇదే సందర్భంలో పౌరసరఫరాల సంస్థ కొనుగోళ్లు చేసి మిల్లర్లు, డీలర్లకు ఇచ్చే గన్నీబ్యాగులను బయట విక్రయించకుండా చర్యలు తీసుకునే విషయాన్ని కూడా పరిశీలిస్తోంది.