తెలంగాణలో ఈ వానాకాలం సీజన్‌లో కోటీ 35 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. 14 లక్షల టన్నుల యూరియా కావాలని గత మార్చిలో తొలుత కేంద్రాన్ని కోరింది. గత ఐదేళ్ల వానాకాల సీజన్ సగటు ప్రకారం తెలంగాణలో యూరియా వినియోగం 9 లక్షల టన్నులే కాగా.. ఈ సీజన్‌లో 10 లక్షల టన్నులు కేటాయించింది. అత్యవసరమైతే మరో 50 వేల టన్నులిస్తామని తెలిపింది.
ఇప్పటివరకూ 25 వేల టన్నులే...
ఈ 10.50 లక్షల టన్నుల యూరియాలో గత నెలలో 1.06 లక్షల టన్నులు రావాలి. 37 వేల టన్నులు తక్కువగా పంపారు. ఈ నెల కోటా లక్షా 62 వేల టన్నుల్లో ఇప్పటివరకూ 25 వేల టన్నులే వచ్చింది. లాక్‌డౌన్ వల్ల కూలీల కొరత, దిగుమతులు రాకపోవడం వల్లనే సకాలంలో పంపలేకపోతున్నట్లు పలు కంపెనీలు వ్యవసాయశాఖకు తెలిపాయి. వచ్చే నెలలో వర్షాలు మొదలైతే అన్ని రాష్ట్రాల నుంచి ఎరువులకు గిరాకీ పెరుగుతుంది.
ఈనెలలోనే గరిష్ఠంగా నిల్వలు పెట్టాలని వ్యవసాయశాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. వచ్చేనెల ఆఖరునాటికి రాష్ట్ర పంటల సాగు అవసరాలకు మొత్తం 10 లక్షల టన్నులు కావాలని అంచనా. ఇప్పటికే 6.50 లక్షల టన్నులు గోదాముల్లో ఉన్నాయి. మిగిలినవి కూడా త్వరగా పంపాలని కంపెనీలను కోరింది.