Telangana Government: భవన నిర్మాణ అనుమతుల కోసం తీసుకొచ్చిన టీఎస్ బీపాస్ అమల్లో అలక్ష్యం వహించిన మరో 39 మంది అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం జరిమానా విధించింది. ఇందులో ఆరుగురు హెచ్ఎండీఏ అధికారులు.. ఆరుగురు మున్సిపల్ కమిషనర్లు, 27 మంది స్క్రూటినీ అధికారులు ఉన్నారు. టీఎస్ బీపాస్ దరఖాస్తుల పరిశీలన.. పరిష్కారంలో కొంత మంది అధికారులు తీవ్ర జాప్యం కనబరుస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు పేర్కొంది.
చట్టం స్ఫూర్తిని కొనసాగించేందుకు వీలుగా అమల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులకు ప్రభుత్వం జరిమానా విధించింది. హెచ్ఎండీఏలో పనిచేసే ఆరుగురు అధికారులకు జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు జిల్లాల్లో మరో 33 మంది అధికారులకు జరిమానా విధించాలని కలెక్టర్లను ఆదేశించింది. ఆరుగురు మున్సిపల్ కమిషనర్లు, 27 మంది స్క్రూటినీ అధికారులకు జరిమానా విధించాలని స్పష్టం చేసింది. 2020లో టీఎస్ బీపాస్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆరు దఫాల్లో 56 మంది అధికారులకు జరిమానా విధించినట్లు ప్రభుత్వం తెలిపింది. టీఎస్ బీపాస్ అమలు ప్రక్రియను తరచూ సమీక్షించాలని.. జాప్యం లేకుండా చూడాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.