Double Bed Room Houses Distribution: డబుల్ బెడ్రూం ఇళ్లకు పట్టిన గ్రహణం వీడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పేదల ఆశలు ఫలించే సమయం సమీపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన ఇళ్ల వివరాలను జిల్లాలు..నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాలవారీగా ప్రభుత్వం సేకరించింది. లక్ష పైచిలుకు ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లుగా అధికారులు లెక్క తేల్చారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించే అవకాశం ఉన్నట్లు గృహనిర్మాణశాఖ వర్గాలకు సమాచారం అందింది. రెండు పడక గదుల ఇళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉంది. లబ్ధిదారుల జాబితా ఇవ్వాలని కేంద్రం షరతు విధించడంతో జూన్‌లో ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో కదలిక మొదలైంది.
లబ్ధిదారుల ఎంపికకు సర్వే మొదలు:నిర్మాణం పూర్తయిన లక్షకు పైచిలుకు ఇళ్లలో సింహభాగం చాలాకాలం క్రితమే పూర్తయ్యాయి. లబ్ధిదారుల ఎంపిక మొదలుకాకపోవడంతో కొన్నిచోట్ల తలుపులు, కిటికీలు చోరీకి గురయ్యాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పంపిణీపై దృష్టి పెట్టింది. ‘లబ్ధిదారుల ఎంపికకు సర్వే మొదలైంది. జూన్‌లో ఇళ్ల పంపిణీ ఉండవచ్చని’ గృహనిర్మాణశాఖకు చెందిన కీలక అధికారి చెప్పారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన 14వేల పైచిలుకు ఇళ్ల విషయంలో పలుచోట్ల వివాదాలు నెలకొన్నాయి. డబ్బులు తీసుకుని లబ్ధిదారుల్ని ఎంపిక చేశారన్న ఆరోపణలొచ్చాయి. 2016-17లో రెండు పడక గదుల ఇళ్ల పథకం మొదలైంది. నిధులు, స్థలాల కొరత, నిర్మాణవ్యయం గిట్టుబాటు కాదన్న కారణంతో గుత్తేదారులు అనాసక్తి చూపడం వంటి కారణాలతో నిర్మాణం ఆలస్యమైంది.