Telangana Diagnostics పేద రోగులు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన ‘తెలంగాణ డయాగ్నస్టిక్స్’ పథకం విజయవంతమైందని తాజా గణాంకాలు పేర్కొంటున్నాయి. దీనికింద ఏర్పాటు చేసిన ల్యాబ్‌లు, రేడియాలజీ హబ్‌ల ద్వారా జులై 31, 2022 వరకు సుమారు 30 లక్షల మంది రోగులకు లబ్ధి చేకూరినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే నిర్ధారణ పరీక్షల సంఖ్య కోటి దాటిందని వెల్లడించింది. వీటి విలువను లెక్కిస్తే రూ.320.7 కోట్లుగా ఉంటుందని వివరించింది. ఆ మేరకు పేద రోగులకు డబ్బులు ఆదా అయినట్లు విశ్లేషించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత వైద్య పరీక్షలే లక్ష్యంగా మరిన్ని డయాగ్నస్టిక్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం తాజాగా పచ్చజెండా ఊపింది.
‘తెలంగాణ డయాగ్నస్టిక్స్’ ప్రస్థానం..:ప్రస్తుతం వైద్యంతో పాటు రోగ నిర్ధారణ పరీక్షలు ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి. జ్వరానికి రక్త పరీక్షలు చేయించుకుంటే.. కనీసం రూ.1000-1,500 వరకూ చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద పరీక్షలైతే రూ.వేలకు వేలు జేబుకు చిల్లు పడడడం ఖాయంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం 2018 జనవరిలో పేదలు ఉచితంగా రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకునేలా జీహెచ్‌ఎంసీ పరిధిలో ‘తెలంగాణ డయాగ్నస్టిక్స్’ పథకాన్ని తీసుకొచ్చింది. ఇది పేద రోగుల పాలిట వరంలా మారింది. దీన్ని గమనించిన ప్రభుత్వం ఈ సదుపాయాలను మరింత విస్తరించాలని నిర్ణయించి గత నాలుగున్నరేళ్లలో మరో 19 డయాగ్నస్టిక్స్ కేంద్రాలను నెలకొల్పింది. వీటిల్లో ప్రధానంగా రక్త, మల, మూత్ర పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్, సీటీ, ఎంఆర్‌ఐ వంటి నిర్ధారణ పరీక్షల కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలో 20 రేడియాలజీ హబ్స్‌నూ అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటికి లభిస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని.. రానున్న రోజుల్లో మరో 19 రేడియాలజీ హబ్స్‌ను, 13 రక్త, మల, మూత్ర పరీక్షలను నిర్వహించే ప్రయోగశాలలను నెలకొల్పడానికి ప్రభుత్వం తాజాగా పచ్చజెండా ఊపింది.
150 రకాలకు పైగా పరీక్షలు ఉచితంగానే..
ప్రయోగశాలల్లో 3 పరికరాలు(ఫుల్లీ ఆటోమెటేడ్ మిషన్స్)ను నెలకొల్పారు. వీటి ద్వారా ప్రధానంగా 57 రకాల సాధారణ రక్త, మల, మూత్ర సమగ్ర పరీక్షలు చేస్తుండగా.. తద్వారా వీటికి అనుబంధంగా ఉండే సుమారు 150 రకాలకుపైగా పరీక్షలు ఉచితంగా పొందే అవకాశం ఏర్పడింది. ప్రయోగశాలలు నెలకొల్పుతున్నా.. నిర్ధారణ పరీక్షల ఫలితాలను 24 గంటల్లోగా ఇస్తేనే వాటికి ఫలితముంటుంది. చాలాచోట్ల 48 గంటలు గడిస్తే గానీ ఫలితాలు వెల్లడవడం లేదనే విమర్శలున్నాయి.