Registration New market Values: రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల కొత్త మార్కెట్ విలువల నిర్ధారణ ప్రక్రియను స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ పూర్తి చేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త మార్కెట్ విలువలను అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు వేగవంతం చేసింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఐజీ శేషాద్రి నేతృత్వంలో ఆ శాఖ సీనియర్ అధికారులు, జిల్లా రిజిస్ట్రార్లు నాలుగు రోజులపాటు సుదీర్ఘ కసరత్తు చేసి ఆదివారం కొత్త మార్కెట్ విలువల నిర్ధారణ ప్రక్రియను ముగించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో అమలు చేసేందుకు వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, అపార్ట్‌మెంట్లకు కొత్త మార్కెట్ విలువలను ఖరారు చేశారు. ప్రాంతాలవారీగా నిర్ణయించిన కొత్త మార్కెట్ విలువలను సీఎంతోపాటు, గతంలో విలువల పెంపునకు ఏర్పాటు చేసిన మంత్రుల సబ్ కమిటీ, CS పరిశీలించనున్నారు. ఇవాళ ఆ ప్రక్రియ పూర్తి చేసి విలువ పెంపు కమిటీలకు ప్రతిపాదనలు పంపనున్నారు. జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు నేతృత్వం వహిస్తున్న కమిటీలు కొత్త మార్కెట్ విలువలకు రెండు మూడు రోజుల్లో ఆమోదముద్ర వేయనున్నాయి. బుధవారంలోపు కమిటీల ఆమోదం పూర్తి చేసేలా స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.
agriculture land values: వ్యవసాయ భూముల విలువ 50 శాతం, ఖాళీ స్థలాల విలువ 35 నుంచి 40 శాతం, అపార్ట్‌మెంట్ విలువలు 25 నుంచి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్‌శాఖ వర్గాలు తెలిపాయి. బహిరంగ మార్కెట్‌లో ఆస్తుల క్రయవిక్రయ విలువలను పరిగణనలోకి తీసుకుని ఈసారి కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. సబ్ రిజిస్ట్రార్ల ద్వారా క్షేత్రస్థాయిలో వ్యవసాయ భూములు, స్థలాలు, ప్లాట్లు క్రయవిక్రయాల సమాచారాన్ని తెప్పించుకున్న రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులు ఆ విలువలను, ఇప్పుడు అమలులో ఉన్న విలువలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు అనేక అంశాలు ఆధారం చేసుకుని కసరత్తు చేసినట్లు తెలిపారు.