ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు ప్రభుత్వ విధివిధానాలు ఖరారు
రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన పురపాలికలు, నగర పాలక సంస్థలకు సంబంధించిన ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు ప్రభుత్వం విధివిధానాలను ప్రకటించింది.
కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అనధికార లేఅవుట్లు, స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా క్రమబద్ధీకరణకు విధివిధానాలను ప్రకటించింది. నూతనంగా ఏర్పాటైన సంస్థలకు మాత్రమే ఈ ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని తేల్చి చెప్పింది. 2018 మార్చి 30వ తేదీ నాటి వరకు ఉన్న లేఅవుట్లను మాత్రమే క్రమబద్ధీకరణ చేస్తామని తెలిపింది. హెచ్ఎండీఏ పరిధిలోని స్థలాలను హెచ్ఎండీఏ, మిగతా పట్టణాభివృద్ధి పరిధిలోని స్థలాలను డీటీసీపీ ద్వారా క్రమబద్ధీకరిస్తామని పేర్కొంది. దరఖాస్తులను మాత్రం ఆయా సంస్థలకు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఆయా ప్లాట్ల మార్కెట్ ధరకు అనుగుణంగా రుసుం వసూలు చేస్తారని తెలిపింది. క్రమబద్ధీకరణ కోసం 90 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం సూచించింది. మొత్తం రుసుములో పది శాతం లేదా పదివేల రూపాయలను దరఖాస్తుతో పాటు చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. మిగతా మొత్తాన్ని ఆ తర్వాత చెల్లించాలని కోరింది. పూర్తి రుసుమును చెల్లించిన ఆర్నెళ్లలోగా భూములు, స్థలాలను క్రమబద్ధీకరిస్తూ అనుమతి జారీ చేస్తామని స్పష్టం చేసింది .
ఇవీ చూడండి : 'సమ్మె విరమించేది లేదు.. చర్చలకు సిద్ధమే'