అమెరికాకు చెందిన దిగ్గజ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మ్యాన్ శాక్స్ గ్రూప్ దేశంలోని తమ రెండో అతిపెద్ద కార్యాలయాన్ని.... హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో 500 మంది నిపుణులను నియమించి... వచ్చే ఏడాది ద్వితీయార్థం నుంచి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధత... హైదరాబాద్‌లో మానవ వనరులు, వాణిజ్య స్థిరాస్తులు, ఉద్యోగులకు గృహాల లభ్యత, నాణ్యమైన మౌలికవసతులను పరిగణలోకి తీసుకొని ఆ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌తో.. గోల్డ్‌మ్యాన్ శాక్స్ సంస్థ భారత విభాగం ఛైర్మన్ సంజయ్ ఛటర్జీ, ఎండీ గుంజన్‌సంతాని, సీఆవో రవికృష్ణన్ దృశ్యమాధ్యమంలో భేటీ అయ్యారు.
హైదరాబాద్ అన్నిరకాలుగా అనువైనది
ఈ సందర్భంగా విస్తరణ ప్రణాళికను వివరించారు. 1869లో అమెరికాలోని న్యూయార్స్‌లో ఏర్పాటైన ఆ సంస్థ.. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్, పెట్టుబడుల నిర్వహణ, సెక్యూరిటీలు, ఉమ్మడి భాగస్వామ్యాలు వంటి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. సంస్థ వార్షిక ఆదాయం 2.74 లక్షల కోట్లుండగా 16 దేశాల్లో విస్తరించి ఉన్న... తమ సంస్థలో 6 వేల మంది పనిచేస్తున్నారని పేర్కొంది. 2004లో బెంగళూరులో కార్యాలయం ప్రారంభించామని.... తమ కార్యకలాపాలు విస్తరించేందుకు హైదరాబాద్ అన్నిరకాలుగా అనువైనదిగా గుర్తించినట్లు వారు వెల్లడించారు. తద్వారా ప్రపంచస్థాయిప్రమాణాలతో కొత్త ప్రతిభను ప్రోత్సహించండంతోపాటు.. ప్రపంచస్థాయి పోటీకి అనుగుణంగా వ్యాపారాల పెంపుదలకు ప్రయత్నిస్తామని సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. తమ సంస్థ భవిష్యత్ వృద్ధికి భాగ్యనగరాన్ని సరైన వేదికగా భావిస్తున్నామని తెలిపారు.