తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్ వేసుకోవడం తప్పనిసరంటూ ప్రజల్లో అవగాహన కల్పించాలనుకుందో సామాజిక కార్యకర్త. సాధారణ మహిళగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి మాస్క్ ధరించండని చెబితే ప్రజలు వింటారో, లేదోననే అనుమానం వచ్చిందామెకు. తమిళుల ఆరాధ్య దైవం మారియమ్మన్ అమ్మవారు. అంటువ్యాధుల బారి నుంచి తమను కాపాడి ఆయురారోగ్యాలను ప్రసాదించమని నిత్యం ఆమెనే పూజిస్తుంటారు.
భక్తులకు మాస్కులు ప్రసాదిస్తున్న మారియమ్మన్
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొంత మంది మాస్కులు ధరించక అజాగ్రత్తతో కరోనా బారిన పడుతున్నారు. ఇలాంటి ప్రజల్లో అవగాహన నింపాలనుకుంది ఓ సామాజిక కార్యకర్త. సాధారణంగా చెబితే ఎవరూ... వినరు. వాళ్లు వినేలా చెప్పాలంటే ఏదైన ప్రత్యేక మార్గం ఎంచుకోవాలనుకుంది. తమిళుల ఆరాధ్య దైవం మారియమ్మన్ అవతారమెత్తింది.
భక్తులకు మాస్కులు ప్రసాదిస్తున్న మారియమ్మన్...
ఆ అమ్మవారి వేషధారణలోనే వెళ్లి చెబితే తప్పక వింటారని భావించింది. దాంతో తలపై కిరీటం, చేతిలో త్రిశూలం ధరించి, కాలికి గజ్జెలు కట్టుకుని ఘల్లుఘల్లుమంటూ వీధుల్లో నడుస్తూ ప్రజల దగ్గరకు వెళుతోంది. భక్తుల వేషధారణలో ఉన్న ఇద్దరు మహిళలు మాస్క్‌లను తీసుకుని ఆమెను అనుసరిస్తున్నారు. రహదారుల్లో మాస్క్‌లు వేసుకోని వారందరినీ ఆపి, అమ్మవారి వేషంలో కరోనా వైరస్ ప్రమాదాన్ని వివరిస్తోంది. దాంతోపాటు వారికి ఉచితంగా మాస్క్‌లనూ అందిస్తోంది.