పెరుగుతున్న రుణభారం, ఖర్చులను తట్టుకునేందుకు.. బల్దియా.. ఆస్తిపన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వీడాలని నిర్ణయించింది. ఈసారి 500కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముందస్తు చెల్లింపులకు 5శాతం డిస్కౌంట్తో.. ఎర్లీబర్డ్ పథకం తీసుకొచ్చింది.
ఈ ప్రతిపాదిత ఆస్తిపన్ను సేకరణ లక్ష్యంలో 50 శాతం (రూ. 250 కోట్లు) పన్నులు వాల్యుయేషన్ అధికారులు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్ల ద్వారా.. 20 శాతం పన్నులు గ్రేటర్ పౌర సేవా కేంద్రాల ద్వారా... ఆన్లైన్ నుంచి 100 కోట్లు... మీ-సేవా ద్వారా 50 కోట్లు సేకరించడానికి ప్రణాళికలు రూపొందించారు.
గతంలో పన్ను చెల్లింపుదారులు కేవలం జీహెచ్ఎంసీ పౌరసేవా కేంద్రాలు, ఆన్లైన్, మీ-సేవా కేంద్రాల ద్వారానే చెల్లించేవారు.. ఎర్లీబర్డ్ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సర పన్ను సేకరణకు జీహెచ్ఎంసీ ఉద్యోగులైన వాల్యుయేషన్ అధికారులు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్కలెక్టర్లను నియమించి.. నివాసేతర ఇళ్ల పన్నులపై దృష్టి సారించారు.