తెలంగాణ

telangana

ETV Bharat / state

అప్పుడు అలా... ఇప్పుడు ఇలా.. వైరస్‌ విస్తరించే ఆస్కారం

హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో కరోనా బాధితుడి ప్రైమరీ కాంట్రాక్ట్‌లను గుర్తించడాన్ని అధికారులు నిలిపివేశారు. కరోనా వెలుగులోకి వచ్చిన తొలినాళ్లలో ఎవరికైనా వైరస్‌ నిర్ధారణ అయితే వెంటనే జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్య, పోలీసు శాఖలు రంగప్రవేశం చేసేవి. సంబంధిత రోగితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి క్వారంటైన్‌ కేంద్రానికి తరలించేవారు. ఆ ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించి ఆంక్షలు విధించేవారు. ఇప్పుడు ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా కరోనా లక్షణాలున్న వారు తమంత తాముగా కేంద్రాలకు వెళ్లి పరీక్ష చేయించుకుంటున్నారు.

CORONAVIRUS
CORONAVIRUS

By

Published : Jul 14, 2020, 7:05 AM IST

  • కూకట్‌పల్లికి చెందిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండడంతో సొంత వైద్యం చేసుకుంటూ వారం తరువాత పరీక్షలు చేయించుకున్నాడు. అతనికి వైరస్‌ ఉన్నట్లు తేలేటప్పటికే ఆ కుటుంబంలోని నలుగురితో పాటు సన్నిహితులు మరో ఇద్దరికి వచ్చింది. వైద్యారోగ్యశాఖ అధికారులు ఇప్పటివరకు ఈ ఇంటికి వెళ్లలేదు. వీరితో మెలిగిన వారినీ గుర్తించలేదు.
  • సైదాబాద్‌లో ఉంటున్న ప్రైవేటు ఉద్యోగికి వారం రోజులుగా జ్వరం రావడంతో గత శుక్రవారం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో పరీక్ష చేయించుకున్నారు. నాలుగు రోజులైనా ఫలితం రాలేదు. రోజురోజుకు జ్వరం తీవ్రమవుతోంది. తనకు కరోనా ఉన్నట్లయితే కుటుంబీకులకు ఇబ్బంది అన్న ఆందోళనలో ఉన్నారు. తన పరీక్ష గురించి అధికారులను అడిగితే ఫలితం ఎప్పుడు వస్తుందో తెలియదని, మంగళవారం మరోసారి యాంటీజెన్‌ పరీక్ష చేయించుకోండంటూ సలహా ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఇది దర్పణం పడుతోంది.

హైదరాబాద్‌ నగరంలో వైరస్‌ సోకిన రోగికి వైద్యం అందించడంతోపాటు సంబంధిత రోగితో ఎవరెవరు సన్నిహితంగా ఉన్నారో ఆరా తీసి వారికీ పరీక్షలు చేయించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ చేతులెత్తేసింది. అనారోగ్యంగా ఉన్నవారే స్వయంగా పరీక్ష కేంద్రాలకు వెళ్లి చేయించుకుని తమ జాగ్రత్తలు తాము తీసుకుంటున్నారు. ఈ రోగితో కలిసినవారు తమకూ లక్షణాలున్నా బయట తిరుగుతూ వైరస్‌ మరింతమందికి విస్తరించడానికి కారణమవుతున్నారు.

నాటికీ.. నేటికి ఎంతో తేడా

కరోనా వెలుగులోకి వచ్చిన తొలినాళ్లలో ఎవరికైనా వైరస్‌ నిర్ధారణ అయితే వెంటనే హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ), వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ రంగప్రవేశం చేసేవి. వైద్యశాఖ సంబంధిత రోగి, సమీప బంధువులతోపాటు సన్నిహితంగా మెలిగిన ఇతరులను గుర్తించి క్వారంటైన్‌ కేంద్రానికి తరలించేవారు. పరీక్షలు చేసి వైరస్‌ లేనివారిని ఇంటికి పంపించి 14 రోజులపాటు ఎటూ కదలకుండా చర్యలు తీసుకునేవారు. ఆ ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించి ఆంక్షలు విధించేవారు. అటు ఎవరూ వెళ్లకుండా పోలీసులు చూసేవారు. తదనంతర కాలంలో ఇటువంటి చర్యలన్నీ మాయమయ్యాయి.

మరో 50వేల పరీక్షలు

వైరస్‌ను నిరోధించాలంటే పెద్దఎత్తున పరీక్షలు చేస్తేనే ఫలితం ఉంటుందని ఐసీఎంఆర్‌ ఇప్పటికే ప్రకటించింది. రాజధానిలో ఇప్పటికే 50 వేల యాంటీజెన్‌ పరీక్షలు చేయించిన ప్రభుత్వం..మరో 50 వేల పరీక్షలు చేయాలని ఇటీవల సూచించింది. రోజూ వందలాది మందికి పాజిటివ్‌ నిర్ధారణ అవుతోంది. ఆ రోగులు అప్పటికే అనేకమందిని కలిసి ఉంటున్నారు. బల్దియా, పోలీసుల సహకారంతో వైద్యశాఖ ప్రైమరీ కాంటాక్టులతోపాటు సెకండరీ కాంటాక్టులను గుర్తించి తక్షణం పరీక్షలు చేయిస్తే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

తమది కాదంటూ..

కరోనా రోగితో తిరిగినవారిని గుర్తించడంలో అలక్ష్యం వహిస్తున్న అధికారులు పరీక్ష చేయించుకున్నవారికి వెంటనే ఫలితాలను ఫోన్‌లో చెప్పడం లేదు. పాజిటివ్‌ వచ్చినవారికి మందుల కిట్లనూ ఇవ్వలేకపోతున్నారు. కనీసం రోగి నుంచి కుటుంబీకులను విడిగా ఉంచే ఏర్పాట్లు లేవు.. రాజధాని నగరంలో ప్రభుత్వ పరిధిలో దాదాపు 5వేలకు పైగా ఐసోలేషన్‌ పడకలు ఖాళీగా ఉన్నాయి. రోగి కుటుంబీకులకు లక్షణాలు ఉంటే తక్షణం వారిని అక్కడకు తరలించి పరీక్ష చేయిస్తే ఫలితం ఉంటుంది. మూడు శాఖలూ ఈ మొత్తం వ్యవహారం తమది కాదన్నట్లుగా వదిలేశారు. ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం మహానగరంతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో 12 వేలమంది కరోనా రోగులు ఇళ్లలోనే ఉండి వైద్యం పొందుతున్నారు. వీరు పరీక్ష చేయించుకోవడానికి ముందే ఎంతమందికి వ్యాధిని విస్తరింపచేశారన్న దానిపై దృష్టి పెడితే వైరస్‌ను చాలావరకు నిరోధించడానికి అవకాశం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

గుర్తిస్తున్నాం కానీ..

కరోనా రోగులతో తిరిగిన కుటుంబీకులను, సన్నిహితులను గుర్తిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో మాదిరి వేగంగా ఈ పని చేయలేకపోతున్నామని.. దీనికి కారణం వైద్య విభాగానికి చెందిన దాదాపు 400 మంది వైరస్‌ బారినపడడమేనన్నారు.

మా ఇంటికి రాకండి..!

అతిథి దేవోభవ అని పెద్దలు అంటుంటారు. కానీ కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎవరైనా ఇంటికొస్తే భయపడుతున్నారు. కొవిడ్‌ నివారణ చర్యలో భాగంగా భోలక్‌పూర్‌ డివిజన్‌ పద్మశాలి కాలనీకి చెందిన ఓ విశ్రాంత అధికారి తన ఇంటి ముందు గేటుకు ‘దయచేసి మా ఇంటికి రాకండి.. మీరు మీ ఇంటికి రానివ్వకండి’ అంటూ రాసిన బోర్డును ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో 36,221కి చేరిన కరోనా బాధితులు..

ABOUT THE AUTHOR

...view details